Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మాసిటీకి కేంద్రం మద్దతు ఇవ్వట్లేదు :
- దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పారిశ్రామికాభివృద్ధికి భారత దేశం లైసెన్సింగ్ విధానంలో సంస్కరణలు అత్యవసరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ''లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియాలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాల నూతన ఆవిష్కరణలు'' అంశంపై ఆయన మాట్లాడారు. ఈ చర్చలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు చెందిన జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మమద్ అథర్లు పాల్గొన్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని మంత్రి చెప్పారు. ఈ రంగానికి ఉతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారత దేశంలో తక్కువ మద్దతు లభిస్తున్నట్టు భావిస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే భారత లైసెన్స్ విధానంలో సంస్కరణలకు అవసరం ఉన్నదని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్స్ రంగంలో స్థిరంగా ఉన్నదనీ, దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. ఫార్మారంగంలో కొత్త ఆవిష్కరణలు జరగాలనీ, డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు అడుగులు పడుతున్నాయనీ అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీతో కలిసి ఫార్మా రంగం పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. భారతదేశంలో పరిశోధన, నూతన ఆవిష్కరణల అభివద్ధికి విదేశాల నుంచి వచ్చే పెట్టుబడుల కోసం విధానాలు సులభతరంగా ఉండాలన్నారు. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలపై పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్‌తో కూడుకున్నవనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తొలి రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. లులూ గ్రూప్ సంస్థ అధినేత యూసుఫ్ అలీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. కీమో ఫార్మా మరో రూ. వందకోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ రే సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.