Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం
- తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు
గ్రామాల్లో ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ దాన్ని నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన సర్క్యూలర్ 333ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ చట్టం రక్షణ కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వెంకట్రాములు పాల్గొని మాట్లాడారు. నేషనల్ మానిటరింగ్ మొబైల్ సిస్టమ్ పద్దతి ద్వారా కూలీల హాజరు కోసం తెచ్చిన సర్క్యులర్ నెం 333ని రద్దు చేయాలన్నారు. కొలతల ప్రకారం పనిచేసే విధానాన్ని విరమించుకోవాలని, కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంత వాసులకు సైతం జాబ్ కార్డులిచ్చి పనులు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరికి వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి డీఆర్డీఓ పీడీకి వినతిపత్రం అందజేశారు.
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు పాల్గొని మాట్లాడారు. 2021 డిసెంబర్ నుంచి పెండింగ్ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ కార్యాలయ ఏఓ మహేష్‌బాబుకు వినతిపత్రం అందించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.