Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్టులోనూ ఘనమే
- అప్పులు పెరగటానికి కారణమిదే
- ఆదాయంతో పోలిస్తే దుబారా ఖర్చే ఎక్కువ : నిపుణులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'అభివృద్ధి.. సంక్షేమంలో మేమే నంబర్‌వన్. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పలు రంగాలు, అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచాం...' ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్లు పదే పదే చెప్పే మాట ఇది. ఇదే సమయంలో అప్పులు, చేబదుళ్లు తీసుకోవటంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణే నిలిచింది. గమ్మత్తేమిటంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈ విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా... ఆ వెనుక రెండో స్థానాన్ని తెలంగాణ ఆక్రమించింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెన్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అత్యధిక రోజులపాటు అప్పులు చేశాయని తేలింది. ఈ సౌకర్యాలను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్టేనని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 'ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఇండియా లిమిటెడ్...' అనే సంస్థ తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ టీఆర్ఎస్ సర్కారు చెబుతూ వస్తున్నది. కానీ ఒకవైపు అప్పులు, మరోవైపు వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం తీసుకునే చేబదుళ్లు రోజురోజుకీ పెరిగిపోవటానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, దుబారా, అప్రధానాంశాలకు ఖర్చు పెట్టటం తదితరాలు ప్రధాన కారణమని తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆదాయానికి సంబంధించి ప్రతీయేటా సర్కారు వేసుకున్న అంచనాలు తప్పుతున్నప్పటికీ రాబడి మాత్రం యేడాదికేడాది ఎంతో కొంత పెరుగుతున్నది. మరి ఆదాయం పెరిగినప్పుడు... అప్పులు, చేబదుళ్ల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీంతోపాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ల పేరిట కూడా ఇబ్బడి ముబ్బడిగా సర్కారు అప్పులు తెస్తున్నది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటప్పుడు మాత్రం ఆయా కార్పొరేషన్ల అప్పులతో తనకేం సంబంధం లేదంటూ సర్కారు వాదిస్తున్నది. ఇది పూర్తిగా అసంబద్ధమైనదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ పేరు ఏదైనా, ఏ రూపంలో అప్పు తీసుకున్నా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి వస్తుందంటూ వారు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులోనూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇదే విషయాన్ని (కార్పొరేషన్ల అప్పుతో ప్రభుత్వానికి సంబంధం లేదు) పునరుద్ఘాటించారు. కానీ ఆయన ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రాధాన్యతలను ఎంచుకోవటం ద్వారా దుబారాను తగ్గించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. తద్వారా చేబదుళ్లు, అప్పులు మరింత పెరక్కుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు. లేదంటే అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.