Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులపై ఆంక్షలు
- కోయపోశగూడేనికి చెందిన 19 మంది ఆదివాసీ మహిళలపై కేసులు
- నిబంధనల మేరకే కేసులు నమోదు చేశామంటున్న అటవీ అధికారులు
నవతెలంగాణ-దండేపల్లి, లక్షెట్టిపేట్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పోడు వ్యవసాయం చేస్తున్నారని ఆ గూడేనికి చెందిన 19 మంది ఆదివాసీ మహిళలను సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేసి, లక్షెట్టిపేట్ కోర్టుకు తరలించారు. ఈ కేసుల్లో పసిపిల్లలను సైతం తల్లులతో సహా రిమాండ్‌కు తరలించడం చర్చనీయాంశంగా మారింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వ వైద్య పరీక్షల కోసం వీరిని లక్షెటిపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు సకాలంలో రాకపోవడంతో ఆదివాసీలు చాలా సేపు ఆస్పత్రి వద్ద నిరీక్షించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
కోయపోషగూడెంలో రెవెన్యూ సర్వే నంబర్ 25, 26 లలో సుమారు 150 ఎకరాల భూమిని 2002, దీనికి ముందు నుండే 48 ఆదివాసీ కుటుంబాలు సాగు చేసుకుంటున్నారు. జీవనోపాధి కోసం వర్షాధార పంటలైన పెసర, కంది, మొక్కజొన్న, పంటలను తమ తాత ముత్తతల నుంచి సాగు చేసుకుంటున్నట్టు తెలిపారు. కానీ అటవీశాఖ అధికారులు తమ భూముల చుట్టూ ట్రెంచ్‌లు, నాళాలను తవ్వడంతో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2021, డిసెంబర్లో మంచిర్యాల ఆర్డీఓ స్వయంగా గిరిజనులు సాగు చేస్తున్న భూములను పరిశీలించి, ప్రభుత్వం తరపున 15 రోజుల్లో పోడు వ్యవసాయ భూములకు పట్టాలు, ప్రభుత్వ భూమి ఉంటే ఇండ్ల నిర్మాణానికి సైతం స్థలాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్టు ఆదివాసీలు తెలిపారు. అప్పట్లో జరిగిన ఆందోళనలో కూడా 12 మంది ఆదివాసీలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆదివాసీ మహిళలు తెలిపారు. గతంలో ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, ఎఫ్ఆర్ఓ రత్నాకర్ తమకు ప్రభుత్వం తరపున పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఇప్పుడు మాట మారుస్తున్నారని, నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని చెబుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎఫ్ఎస్ఓ స్రవంతి, బోజన్నలు తమ పట్ల దుర్భాషలాడుతూ, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని గిరిజన మహిళలు తెలిపారు.
పట్టాలిస్తామని మోసం చేస్తున్నారు : దోశాండ్ల సునీత
2002 నుంచి మేము సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం మా పోడు వ్యవసాయ భూములకు పట్టాలిస్తామని మోసం చేస్తోంది. మా తాతముత్తతాల నుంచి పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు మా భూములపై మాకు హక్కులు లేవంటే మేమెలా బతకాలి. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా అటవీ అధికారులు తమను లాక్కొని రావడం ఎంత వరకు న్యాయమో అధికారులకే తెలియాలి.
మాకు జీవనోపాధి ఏది? : మోడితే పోసవ్వ
మాకు అడవితల్లే ఆధారం. మేము అడవిని కంటికి రెప్పలా కాపాడుతాం. వర్షాధార పంటలపై భూమిని నమ్ముకుని జీవించే మమ్మల్ని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. పిల్ల, పెద్దలం అందరం అటవీ అధికారుల దాడులతో భయానికి గురవుతున్నాం. ప్రభుత్వం మా భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
నిబంధనల మేరకే కేసులు : రత్నాకర్, ఎఫ్ఆర్ఓ, తాళ్లపేట్
గిరిజనులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నూతనంగా పోడు సాగు చేస్తున్నారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వారిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకే అటవీశాఖ భూమిలో సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.