Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల కోసం జిల్లాల్లో
- శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయండి
- ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.ఐదు లక్షల సాయం అందించాలి
- కమిషనరేట్ వద్ద ఎన్పీఆర్డీ ధర్నా
- సమస్యలను పరిష్కరిస్తామని అధికారుల హామీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికలాంగుల కో-ఆపరేటీవ్ కార్పొరేషన్ బలోపేతం చేయాలనీ, మూసేసిన ట్రైనింగ్ కం ప్రొడక్షన్ సెంటర్స్ (టీసీపీసీ) కేంద్రాలను ప్రారంభించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) డిమాండ్ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరింది. వికలాంగులకు ఎలాంటి షూరిటీ లేకుండా రూ.ఐదు లక్షల సాయం చేయాలని డిమాండ్ చేసింది.వీటితోపాటు ప్రతి జిల్లాల్లో స్టడీ సర్కిల్ ఏర్పాటుచేయాలనే పలు డిమాండ్ల సాధన కోసం సోమవారం హైదరాబాద్‌లోని మలక్‌పేట్ వికలాంగుల శాఖ కమిషనరేట్ వద్ద ఎన్పీఆర్డీ ధర్నా నిర్వహించింది. అనంతరం వికలాంగుల కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ, జనరల్ మేనేజర్ ప్రభంజన్రావుకు ఎన్పీఆర్డీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్టెట్ కేటాయింపుల్లో తగిన నిధులు కేటాయించకుండా వికలాంగుల కార్పొరేషన్ పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. నిధులు కేటాయించకపోవడంతో వారికి సౌకర్యాలు అందడం లేదన్నారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారిందని చెప్పారు. సూర్యాపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సదాశివ పేట, హైదరాబాద్‌లో ఉన్న టీసీపీసీ కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి, హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో మూసేశారనీ, వాటిని వెంటను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మూడు కేంద్రాల్లో క్యాలిఫర్స్ తయారు చేసే కేంద్రాలు ఉన్నప్పటికి అవి ఎక్కడా సరిగా పని చేయడం లేదని తెలిపారు. నల్లగొండలో స్థలం లేదనే కారణంగా కేంద్రాలు మూసేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కోఠి ఈఎన్టీలో ఉన్నటువంటి హియరింగ్ మౌల్డ్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన శిశువుకు హియరింగ్ టెస్టు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సౌండ్ లైబ్రరీలో అవసరమైన సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. బధిరులు, ఆంధుల కోసం ప్రత్యేక పథకాలను కార్పొరేషన్ అమలు చేయాలన్నారు. వికలాంగుల కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో మూసేసిన చాక్పిక్ తయారీ కేంద్రం ప్రారంభించాలనీ, మహిళా వికలాంగుల కోసం కుటిర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తీవ్ర వైకల్యం కలిగిన వారికి బ్యాటరీవీల్ చైర్స్ ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలనీ, చదువుతోనిమిత్తం లేకుండా మోటారైజ్డ్ స్కూటర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడంతోపాటు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పించాలన్నారు. బధిరులకు 4జి ఫోన్స్, ఆంధులకు ల్యాప్టాఫ్స్ పంపిణీ చేయాలన్నారు. పరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనే నిబంధనను ఎత్తివేసి, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పరికరాలు అందించాలని కోరారు. 2016 ఆర్పీడీ చట్టం సెక్షన్ 35 ప్రకారం ప్రయివేటు పరిశ్రమల్లో ఐదు శాతం ఉపాధి కల్పనకు కృషి చేయాలన్నారు. అంధులకు ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన కెన్స్టిక్స్ పంపిణీ చేయాలని కోరారు. బహుళ వైకల్యం కలిగిన వారికి ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా వైకల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగుల కార్పొరేషన్‌ను పరిరక్షించుకోవడం కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి మధుబాబు, సహాయ కార్యదర్శులు బాలీశ్వర్, ఉపేందర్, సభ్యులు రంగారెడ్డి, సాహిన్బేగం, ప్రకాశ్, లలిత, భుజంగరెడ్డి, రాజశేఖర్‌గౌడ్, ప్రభుస్వామి, శశికళ, మల్లేష్‌తోపాటు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.