Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆర్జేడీసీఎల్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (ఆర్జేడీసీఎల్) డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదనలు పంపాలంటూ ఉత్తర్వులు వచ్చినా ఇంత వరకు కొన్ని శాఖలు ప్రభుత్వానికి పంపలేదని తెలిపారు. విద్యాశాఖ పరిధిలోని కొన్ని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ప్రతిపాదనలు ఇప్పటికి ప్రభుత్వానికి చేరుకోలేదని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లోగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చారిత్రాత్మక నిర్ణయమనీ, ఇందుకోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నారనీ, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు పరుశరాములు, హరిబాబు, పిడమర్తి ఉపేందర్, విద్యాసాగర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.