Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓపెన్ చాలెంజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? తెలంగాణలో రైతులకు లాభం చేకూర్చినట్టుగా ఎక్కడైనా చేశారా? అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓపెన్ చాలెంజ్ విసిరారు. సోమవారం హైదరాబాద్‌లో రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని వద్దిరాజురవిచంద్ర అందుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ..ప్రజలకు సేవచేసే మంచి గుణం ఉన్న బీసీ నేత ఒద్ది రాజు రవిచంద్రను రాజ్యసభ కు పంపినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ను కలిశాడా? జేఏసీ మీటింగ్ కు ఎప్పుడైనా వచ్చాడా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి లాంటి వారు జయశంకర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తన గురువు అనీ, ఆయన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసింది తామేనని చెప్పారు. బ్రోకర్ గాళ్ళు ఎన్నికల కోసం మాట్లాడితే ప్రజలు నమ్మరని విమర్శించారు. రైతు బంధు సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..కులమతాలకతీతంగా అన్ని సామాజిక తరగతుల నాయకులకు కేసీఆర్ అవకాశం ఇస్తున్నారన్నారు. కులం- మతం ఎత్తుకొని సమాజంలో చీడ పురుగు ల్లాగా కొన్ని పార్టీల వాళ్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి వేలానికి పెట్టారని ఆరోపించారు. కులాల- మతాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారనీ, ఆయన జయశంకర్ సార్‌ను ఉద్యమంలో ఎన్నడూ కలువలేదని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రచ్చబండలోనే రేవంత్‌రెడ్డిని రచ్చకీడుస్తామన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడితే బీజేపీ భయపడుతున్నదన్నారు. తెలంగాణలో ఎక్సైజ్ సుంకం, టాక్స్ పెంచలేదన్నారు. నెల రోజులు వరుసగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ఏదో మొక్కుబడిగా తగ్గించి గొప్పగా పచారం చేసుకుంటారా? అని నిలదీశారు. వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ..తనకు ఎంపీ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.