Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టభద్రుల దినోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరు
- హైదరాబాద్‌లో లేనందున సీఎం కేసీఆర్ రాలేకపోతున్నారు : డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పట్టభద్రుల దినోత్సవం ఈనెల 26న జరుగుతుందనీ, ముఖ్యఅతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల చెప్పారు. అదేరోజు ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001లో నాటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి దీన్ని ప్రారంభోత్సవం చేశారని గుర్తు చేశారు. ఐఎస్బీ ఐదో వార్షికోత్సవానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్, పదో వార్షికోత్సవానికి నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, 15వ వార్షికోత్సవానికి నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారని చెప్పారు. ఇప్పుడు 20వ వార్షికోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రుల దినోత్సవాన్ని మొదటిసారి ఐఎస్బీ హైదరాబాద్‌కు చెందిన 600 మంది, మొహాలికి చెందిన 300 మంది కలిపి 900 మంది విద్యార్థులతో నిర్వహిస్తున్నామని వివరించారు. ఎనిమిది విద్యార్థులకు ప్రధాని మోడీ బంగారు పతకాలను ప్రదానం చేస్తారని చెప్పారు. విద్యార్థులనుద్దేశించి కీలకోపన్యాసం చేస్తారని అన్నారు. ప్రొటోకాల్, ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన సూచనల ప్రకారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర అధికారులు హాజరవుతారని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో అందుబాటులో లేనందున, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఐఎస్బీకి ఈనెల 26న సీఎం కేసీఆర్ రావడం లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం తమకు సమాచారం ఇచ్చిందని వివరించారు. అయితే సీనియర్ మంత్రిని పంపిస్తామంటూ అందులో పేర్కొన్నారని అన్నారు. ఆ మంత్రి ఎవరనేది ఇంకా తెలియదన్నారు.
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకుల్లో దేశంలోనే నెంబర్‌వన్ ఐఎస్బీ
ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ప్రోగ్రామ్‌లో దేశంలోనే ఐఎస్బీ నెంబర్‌వన్‌గా నిలిచిందని ఐఎస్బీ డిప్యూటీ డీన్ దీపామణి చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో గతంలో 64వ ర్యాంకు ఉంటే ప్రస్తుతం 38వ ర్యాంకు సాధించిందని వివరించారు. 49 వేల మంది ఎగ్జిక్యూటివ్‌లకు ఐఎస్బీ శిక్షణ ఇచ్చిందన్నారు. వ్యక్తిగతంగా, పరిశ్రమలకు అవసరమైన పరిజ్ఞానాన్ని వారికి అందించామని అన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు వ్యాపార రంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా సరైన ప్రణాళిక రూపొందించుకునేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ ప్రొఫెసర్ గురు పాల్గొన్నారు.
ఐఎస్బీని పరిశీలించిన సివి ఆనంద్
ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నందున ఐఎస్బీ ప్రాంగణాన్ని హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ పరిశీలించారు. ఆయనతోపాటు హైదరాబాద్ అడిషనల్ సీపీ ఎఆర్ శ్రీనివాస్, సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మొహంతి ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు, భద్రత వంటి అంశాలను పరిశీలించారు. ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్లతో పలు అంశాలపై వారు చర్చించారు.