Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం :రేవంత్ రెడ్డి
- లక్ష్మాపూర్ గ్రామంలో రచ్చబండ
నవతెలంగాణ-శామీర్‌పేట
కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగితేనే ప్రజలు సంతోషంగా ఉంటారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం సీఎం దత్తత గ్రామం లక్ష్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎడ్ల బండిపై ఊరేగింపుగా రచ్చబండ వేదికకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ రైతు డిక్లరేషన్‌ను చదివి వినిపించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాన్ని లక్ష్మాపూర్ గ్రామం నుంచే వివరించడానికి వచ్చారని తెలిపారు. ఐదేండ్ల కిందట లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, కేశవరం గ్రామాలను కేసీఆర్ దత్తత తీసుకున్నారని, ఇక్కడే ధరణి పోర్టల్ ప్రారంభించబడినా.. సమస్యలు మాత్రం తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన 542 మంది రైతులకు పట్టాదారు పాసుబుక్కులు, బ్యాంకు ఖాతాలు కూడా లేవని, ఆన్లైన్లో వారి భూముల వివరాలు లేక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 30 రోజుల్లో ప్రతి రైతుకు పాసుబుక్కులు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, బామ్మర్ది భూ కబ్జాలపై విచారణ జరిపిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రోజుకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు రచ్చబండకు వచ్చేదారిలో కుమ్మరి ఎల్లమ్మను రేవంత్ రెడ్డి పలకరించారు. రోడ్డు వైండింగులో తన ఇంటి స్థలాన్ని కోల్పోయానని, తనకు ఇల్లు కట్టించాలని రేవంత్‌ను వేడుకున్నారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి ఎల్లమ్మకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎల్లమ్మకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున మేడ్చల్ కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి రూ. 5 లక్షలతో ఇల్లు కట్టిస్టారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్, మూడు చింతలపల్లి మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు యాదవ్, కార్పొరేటర్ అజరు యాదవ్, వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ సింగం సత్యనారాయణ, బండి జగన్నాధం, ఉపసర్పంచ్ కటికెల వైద్యనాధ్, జైపాల్ రెడ్డి, రమేష్, నాయకులు దోసకాయల వెంకటేష్, వీరేశం గుప్తా, తూము వేణుగోపాల్ రావు, మహేందర్ యాదవ్, కటికెల గోపి, రైతులు పాల్గొన్నారు.