Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రని ఎండలో ఎర్ర జెండాతో రైతుల ర్యాలీ
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-ములకలపల్లి
లక్షలోపు రైతు రుణాలను ఏకకాలంలో వెంటనే మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో తరుణంలో రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతులను మభ్యపెట్టి నేటికీ మాఫీ చేయలేదని ఆరోపించారు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ధరణి పోర్టల్లో మార్పులు తీసుకొచ్చి పెండింగ్లో ఉన్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు తక్షణమే మంజూరు చేయాలన్నారు. రైతులకు కొత్త రుణాలు మంజూరుతో పాటు రైతు బీమాలో వయో పరిమితి లేకుండా బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎరువులు, పురుగుమందుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రైతుబంధు ఇవ్వాలని, కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు.
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పోడు సాగుదారులపై పెట్టిన ఫారెస్ట్ అధికారుల అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల దరఖాస్తులను తక్షణమే పరిశీలించి హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ముదిగొండ రాంబాబు, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు పూకంటి రవికుమార్, నిమ్మల మధు, సోయం వీరస్వామీ, వర్సా శ్రీరాములు, గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.