Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక విద్యార్హతలకు స్థాయిలు : కేంద్రం ప్రతిపాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యారంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే వివిధ విద్యార్హతలకు స్థాయిలను (గ్రేడింగ్) నిర్ణయించే దిశగా 'నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్' విధానాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదించింది. ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా రూపొందించిన ముసాయిదాపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనూ కోరుతున్నది. ప్రపంచ స్థాయిలో అనుసరిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో క్రెడిట్స్, విద్య స్థాయి విధానాలను అమలు చేయాలన్నదే ఈ ముసాయిదా ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. విద్య, పరిశోధన, వృత్తి విద్య, స్కిల్ డెవలప్మెంట్ విద్యకు విడివిగా స్థాయిలను కేటాయిస్తారు. ఒకటి నుంచి నాలుగు వరకూ ఉండే లెవల్లోకి స్కూల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఐదో లెవల్లో సాంకేతిక నైపుణ్యాన్ని, విశ్లేషణాత్మక ఆలోచనలతో కూడిన విద్యను చేర్చారు. ఆరో లెవల్లో పరిశోధనకు అవసరమైన సాంకేతిక విద్యను, ఏడో లెవల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విద్య, ఎనిమిదో లెవల్లో టెక్నికల్ స్కిల్స్, డిజైన్, ఆలోచన విధానాన్ని స్వతహాగా కనబరిచే విద్య సంబంధమైన స్థాయిని చేర్చారు. ఏ దేశానికైనా వెళితే ఫలానా కోర్సు చేశాను అనే పరిస్థితి లేకుండా, ఏ లెవల్ అనే విషయాన్ని చెబితే సరిపోయేలా ఉన్నత విద్యావిధానాన్ని రూపొందించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. అయితే, దీని అమలు క్రమంలో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై లోతైన అధ్యయనం చేసి, ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్య మండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ అభిప్రాయపడ్డారు.