Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి : పౌర హక్కుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర హైకోర్టు చట్టబద్ధంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని పౌర హక్కుల సంఘం - తెలంగాణ డిమాండ్ చేసింది. దిశ ఘటన లాంటివి తిరిగి జరగకుండా మూలాలను కొనుగొని పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్లో జరిగిన మీడియా సమావేశంలో దిశ నిందితుల తరపు న్యాయవాది కృష్ణమాచారితో కలిసి పౌర హక్కుల సంఘం - తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.సురేష్ కుమార్, నగరశాఖ ఉపాధ్యక్షులు విష్ణు మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు వేసిన సిర్పుర్కర్ కమిటీ విచారించి బూటకపు ఎన్‌కౌంటర్‌గా నిర్దారించిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నమోదైన 10 మంది పోలీసులను న్యాయస్థానం ముందు హాజరు పరిచి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ సమయంలో కమిషనర్‌గా ఉన్న సజ్జనార్, సురేందర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల అలసత్వమే కారణం...కృష్ణమాచారి
దిశ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసుల స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని కృష్ణమాచారి తెలిపారు. సమాజంలో నేరాలు పెరిగిపోవడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమని చెప్పారు. పోలీసు విధానంలో మార్పులు వస్తే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రజలకు అవసరమైనన్ని కోర్టులను ఏర్పాటు చేయకుండా న్యాయస్థానాల్లో సత్వర న్యాయం దొరకదనే భావనను సమాజంలో పెరిగేలా ప్రభుత్వం చేసిందని విమర్శించారు. సిర్పుర్కర్ కమిటీ చేసిన సిఫారసులకు చట్టరూపం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ తీరును చూస్తే పోలీసులు అసలు దోషులను తప్పించారా? అనే అనుమానం కలిగించేదిగా ఉందని తెలిపారు. సామాన్యుల హక్కుల పరిరక్షణకు వీలుగా బూటకపు ఎన్కౌంటర్లకు ఫుల్స్టాప్ పడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సిర్పుర్కర్ కమిటీ నివేదిక నేపథ్యంలో హైకోర్టు 10 మంది ఎన్కౌంటర్ బాధ్యులపై ఎఫ్ఐఆర్కు ఆదేశించే అవకాశముందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సైతం ఎన్‌కౌంటర్‌పై అబద్ధాలే చెబితే ఇక ప్రజలకు దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదలాయించడంపై వ్యాఖ్యానిస్తూ, ఆ కేసుకు సంబంధించిన ఇతర పిటీషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందునే ఇది జరిగిందని చెప్పారు. జూన్ ఆరు లోపు కేసు తిరిగి విచారణకు వచ్చే అవకాశముందనీ, ఆ సమయంలో తాను ఎన్కౌంటర్లో నేరుగా పాల్గొన్న వారితో పాటు వారిని ఉన్నతాధికారులు ఆదేశించారా? అనే విషయంపై వాదించనున్నట్టు తెలిపారు.