Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిలో రూ.298
చికెన్ ధర పిరమైంది. కిలో రూ 300లకు చేరింది. 15రోజుల క్రితం కిలో ధర 220 ఉండగా, నేడు రూ 300లకు రికార్డు స్థాయికి చేరింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారుల సంఖ్య తగ్గిందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగాయి. గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోవడంతో వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్టోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండల ప్రతాపాన్ని కోళ్లు తట్టుకోలేకపోతున్నాయి. అత్యధిక కోళ్లు చనిపోతున్నాయి. ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో వినియోగదారులకు కోడి మాంసం సరిపోవడంలేదు. ఫలితంగా ధరలు పైపైకి పోతున్నాయి.
- తగ్గిన ఉత్పత్తి...పెరిగిన వినియోగం
- వేడికి 30 శాతం చనిపోతున్న కోడి పిల్లలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎండలకు 30 శాతం కోడి పిల్లలు చనిపోతాయి. దీంతో పౌల్ట్రీ యాజమానులు కూడా కోడి పిల్లల్ని తక్కువగానే పెంచుతారు. ఇలాంటి కారణాలతో వేసవి కాలంలో చికెన్ ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కిలో తీసుకెళ్లే వినియోగదారుడు అరకిలోకే పరిమితమవుతున్నారు. మార్చిలో కేజీ రూ. 180...మేలో రూ. 300
మార్చిలో కోడి మాంసం కిలో ధర రూ. 180 ఉండగా, రెండు నెలల్లో ఏకంగా రూ. 300కి ఎగబాకింది. దీంతో చికెన్ షాపులకు వినియోగదారుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. మరోవైపు మేక, గొర్రెల మాంసానికి కిలో ధర రూ 700 నుంచి రూ 800 ఉండటంతో కోడి మాంసం వైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. పండగలు, పెండిళ్లు, జాతర్లు, బోనాలకు పండుగలకు వినియోగం బాగా ఉంటుంది. ఈఏడాది ఫిబ్రవరి (2022)లో జరిగిన సమ్మక్క, సారక్క జాతరలో భక్తులు కోడి మాంసాన్ని అత్యధికంగా వినియోగించారు. ఆ తర్వాత మార్చిలో కోడి పిల్లలను వేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాలేదు. చికెన్ ధరలు పెరగడానికి దీని ప్రభావం కూడా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారంతో నిమిత్తం లేకుండా ప్రతి రోజూ కోడి మాంసం తినేవాళ్లు లేకపోలేదు. ఇంటికి చుట్టాలు, స్నేహితులొచ్చినా, పుట్టిన రోజులు, పండుగలు, పబ్బాలు ఒక్కటేమిటీ...అన్నింటిలోనూ చికెన్ ముక్క మజా చేయాల్సిందే. దావత్ జరగాల్సిందే. అలాంటిది ధర పెరగడంతో వినియోదారులు ఇబ్బంది పడుతున్నారు.
కోళ్ల ఫీడింగ్ ధరలు రెట్టింపు
పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమపై రవాణా చార్జీల ప్రభావం పడింది. ఫలితంగా కోళ్ల ఫీడింగ్ ధరలు రెట్టింపయ్యాయి. ఇదే కాకుండా కోళ్ల ఫీడింగ్ కోసం బ్రెజిల్ నుంచి సోయాబీన్‌ను దిగుమతి చేసుకుంటారు. దీని ధర పెరగడం మరో కారణం. ఫలితంగా చిన్న చిన్న పౌల్ట్రీ ఫామ్స్ నడుపుతున్న యాజమానులకు భారంగా మారింది. కొన్ని సంస్థలే తట్టుకుని నిలబడుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ కోడి మాంసం ఉత్పత్తిలో కనీసం 2 శాతం లేదా 4 శాతం ఉత్పత్తి పడిపోతున్నదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. వేడికి సాధారణంగా బ్రాయిలర్ కోళ్లకు తట్టుకునే శక్తి ఉండదు. ఇతర రోగాలు కూడా వాటిపై దాడి చేస్తున్నాయి. వాటి ఫలితంగా కోడి మాంసం ఉత్పత్తి తగ్గిపోతున్నది. అంతే కాకుండా నష్టాల భయంతో చిన్న,చిన్న పౌల్ట్రీ రైతులు కోడి పిల్లలను పెంచరు. నీటివసతి తక్కువగా ఉన్న రైతులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ 3 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 1.50 కోట్ల గుడ్లు వినియోగించగా, ఇతర రాష్ట్రాలకు 1.50 కోట్ల గుడ్లు ఎగుమతి చేస్తారు.
వేసవిలో ఉత్పత్తి తగ్గడం సహజమే
ఎండా, వేడిమికి తట్టుకోలేక కోళ్లు మరణిస్తాయి. దీంతో కోడి మాంసం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీంతో ధరలు కొంతమేరకు పెరుగుతాయి. కోళ్ల దానా ధరలూ పెరిగాయి. బలవర్థకమైన ఆహారంలో బాగంగా కోళ్లకు సోయాబీన్ ఎక్కువగా ఇస్తాం. అది బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటాం. కోళ్ల దానా ధరలు అధికం కావడంతో కొంత మంది రైతులు కోళ్లను పెంచడం లేదు. వీటి కారణాలతోనే కోడి మాంసం ధరలు కొంతమేరకు పెరిగాయి.
- సొరసాని రవీందర్‌రెడ్డి. రాష్ట్ర నాయకులు, తెలంగాణ పౌల్ట్రీ బ్రాయిలర్ బ్రీడర్స్ అసోసియేషన్