Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు..
- ధరల అనిశ్చితినీ తట్టుకునే విధంగా రూపొందించాలి
- అరిబండి లక్ష్మీనారాయణ నాలుగో స్మారకోపన్యాసంలో
విశ్రాంత ఆచార్యులు దండ రాజిరెడ్డి
- రాష్ట్రానికి అవసరమైన పంటలపై అవగాహన కల్పించాలి : సాగర్
- ప్రణాళిక రూపొందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒడిదుడుకులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ధరల అనిశ్చితిని తట్టుకునే విధంగా పంటల ప్రణాళిక ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు దండ రాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మేరకు దాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. వాతావరణంతోపాటు ఇతర అనేక మార్పులకు తెలంగాణ భిన్నం కాదని అన్నారు. అందువల్ల వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికను రూపొందిం చాలని కోరారు. 'మారుతున్న పరిస్థితుల్లో పంటల ప్రణాళిక' అనే అంశంపై హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. అరిబండి ఫౌండేషన్, తెలంగాణ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మెన్, విశ్రాంత ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు అధ్యక్షత వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, పి.జంగారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ... సమగ్ర వ్యవసాయ విధానం, ప్రణాళిక ద్వారానే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమని నొక్కి చెప్పారు. 'మనది వ్యవసా యక దేశం. దాదాపు 65 శాతం జనాభా ఆ రంగంపై ఆధారపడి ఉంటుంది. అది పూర్తిగా రుతు పవనాల ఆగమనం, విస్తరణ, నమోదయ్యే వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. వీటికితోడు మారుతున్న వాతావరణ పరిస్థితులు, అనుకూల, ప్రతికూల పరిస్థితులతోపాటు పంటల ధరలు, మార్కెటింగ్ వ్యవస్థ, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాంటి పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి...' అని వివరించారు. ఒకే పంట విధానాన్ని (మోనో క్రాపింగ్) అనుసరించటం లేదా పంట మార్పిడి లేకుండా సేద్యం చేయటమనేది మంచిది కాదని తెలిపారు. వరి విస్తీర్ణాన్ని తగ్గించి, మిగతా పంటలు, పంటల విధానాన్ని, సమీకృత వ్యవసాయం, పశు సంపద, ఉద్యానవన పంటలతో కూడిన, అవసరాల ప్రాతిపదికన పంటల ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని వివరించారు. ఇదే సమయంలో సాగునీటి విస్తీర్ణం, నీటి వనరులు, మిషన్ భగీరథ, అధిక, అత్యల్ప వర్షపాతాలకు సంబంధించిన అనేకాంశాలను ఆయన సోదాహరణంగా వివరించారు. రాష్ట్రం లోని వాతావరణ పరిస్థితులు, నేల రకాలు, నీటి వసతిని పరిగణలోకి తీసుకుని సమర్ధవం తమైన పంటల కాలనీలను (క్రాప్ కాలనీ) ఏర్పాటు చేసుకో వాలని కోరారు. ప్రతి సంవత్సరం ముందస్తు వాతా వరణ సూచనలు, పంటల ధరలు, మన అవసరా నికి సరిపోయే పంటలు, ఎగుమతికి అవసరమైన పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఇవన్నీ సాధించుకోవాలంటే వ్యవసాయం, దాని అనుబంధ శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో (బాటమ్ అప్ అప్రోచ్- అంటే కిందిస్థాయి నుండి పై స్థాయికి) రైతుల భాగ స్వామ్యంతో ఇలాంటి చర్యలన్నింటినీ చేపట్టాలని రాజిరెడ్డి సూచించారు. సాగర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సీజన్లు ముందుకొస్తున్నప్పుడు హడావుడిగా పంటల ప్రణాళికలు రూపొందిస్తున్నదే తప్ప, ఆ అంశంపై స్పష్టమైన విధానం లేదని అన్నారు. తెలంగాణలో ధాన్యం, పప్పులు, వాణిజ్య పంటల అవసరాలను గుర్తించి దానికనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ఇప్పటికైనా అలాంటి ప్రణాళికను రూపొందిం చాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. భూసార పరీక్షలు నిర్వహిస్తాం, సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తామంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించిదని గుర్తు చేశారు. ఇంతవరకూ వాటికి అతీగతీ లేదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇటు రైతుకు, అటు వినియోగదారుడికీ న్యాయం జరగటం లేదని తెలిపారు. అందువల్ల మేధావులు, రైతు నిపుణులతో చర్చించి స్పష్టమైన పంటల ప్రణాళికను రూపొందించాలని కోరారు.