Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఈపీ, సీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం
- ధరల పెరుగుదలపై 27,28 తేదీల్లో నిరసనలు
- టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగించిన వీరోచిత పోరాటం స్ఫూర్తితో విద్యారంగంతోపాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)కు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈనెల 27,28 తేదీల్లో జిల్లా, డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 20,21,22 తేదీల్లో విజయవాడలో ఎస్టీఎఫ్ఐ జాతీయ మహాసభ జరిగాయని వివరించారు. విద్యారంగ సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించామన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశామని చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం అమలు పేరుతో విద్యారంగాన్ని వ్యాపారీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణ దిశగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పేదలకు విద్యను మరింత దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీవైపు ప్రపంచం వెళ్తుంటే, భారత్ మాత్రం పురాణాలు, మతఛాందస భావాలను విద్యార్థుల మనసుల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. ధరలను నియంత్రించడంలో విఫలమైన కేంద్రం భావోద్వేగాలను పెంచడం, మత విభజనను రెచ్చగొట్టడం, ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 25 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఎస్టీఎఫ్ఐ మహాసభ తీర్మానించిందని చెప్పారు. జాతీయ విద్యావిధానం అమలును నిలిపివేయాలనీ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వచ్చేనెలలో జిల్లా కేంద్రాలు, జులై మొదటివారంలో రాష్ట్ర కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అదేనెల 17న ఢిల్లీలో సదస్సు నిర్వహిస్తామని వివరించారు. విద్యారంగంలో ఖాళీపోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.ఐదు లక్షలకు, పొదుపు మొత్తాలపై రాయితీని రూ.మూడు లక్షలకు పెంచాలని కోరారు. మత సామరస్యం, జాతీయ సమైక్యతను కాపాడాలన్నారు. 317 జీవో అప్పీళ్లు, 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులను పరిష్కరించాలన్నారు. సీనియార్టీ సమస్యలు, పరస్పర బదిలీల దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. గెజిటెడ్ హెచ్ఎం వరకు యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులుగా చావ రవి, ఎం సంయుక్త, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ దుర్గాభవాని, కేంద్ర కమిటీ సభ్యులుగా కె జంగయ్య, వి శాంతికుమారి ఎన్నికయ్యారని వివరించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ శారద మాట్లాడుతూ మహిళల్లో నాయకత్వ ప్రతిభను పెంపొందించేందుకు స్టడీసర్కిళ్లు, సెమినార్లు నిర్వహిస్తామని చెప్పారు. విద్యద్వారానే మహిళల సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ విద్యావిధానం అమలు బాలికల విద్యకు గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగికదాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.