Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజా సమస్యలపై మిలిటెంట్ పోరాటాల నిర్వహణలో సీపీఐ(ఎం) అగ్రభాగంలో ఉందని, అదే సమయంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా జిల్లా పార్టీ ముందు ఉందని, మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సేవా కార్యక్రమాల నిర్వహణ జిల్లా ముఖ్యుల సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ 'సభ్యులు వై.విక్రమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో నాలుగు సెంటర్లలో బీపీ, షుగర్ పేషంట్ల మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ, ప్రతి నెలా ఐదు వేల మందికి సేవలు అందించడం మామూలు విషయం కాదని అభినందించారు. మందుల ఖర్చు బాగా పెరిగి ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని, జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణకు పూనుకోవాలని కోరారు. మహిళలకు కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఉచితంగా మిషన్లు పంపిణీ చేయాలని, పోటీ పరీక్షల సన్నద్ధత కోసం యువతకు ఉచిత లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకూ తమ ఉచిత సేవల నుంచి తప్పుకుంటున్నాయని ఆరోపించారు.
ప్రపంచ బ్యాంకు సంస్కరణల పేరుతో కార్పొరేట్ సంస్థలకు అవకాశం ఇవ్వడంతో ఉచిత సేవలు మరింత ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పోరాటాలతో పాటు ప్రజలకు మరింతగా వివిధ రంగాల్లో ఉచిత సేవలకు జిల్లా పార్టీ నాయకులు పూనుకోవాలని పిలుపు నిచ్చారు.
సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, బొంతు రాంబాబు, ప్రముఖ డాక్టర్లు యలమంచిలి రవీంద్రనాథ్, రవి, కెట్ల రంగారావు, పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.