Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఐసీఐ అకాడమితో ఒప్పందం : మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం కోసం బీసీ సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అత్యుత్తమ శిక్షణ అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సమక్షంలో మంగళవారం హైదరాబాద్లో ఐసీఐసీఐ అకాడమితో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సాప్, అకౌంటెన్సీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో బీసీ యువతకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తామని చెప్పారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల దీన్ని అమలు చేస్తామన్నారు. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ అర్హతతో హైదరాబాద్ కేంద్రంగా ఈ శిక్షణను ఇస్తామని వివరించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అత్యుత్తమ శిక్షణతో వృత్తి నైపుణ్యం పెంపొందించుకుని ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని బీసీ యువత సొంత కాళ్లపై నిలబడాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి బాలాచారి, ఐసీఐసీఐ అకాడమి ప్రతినిధులు సుఖేత్కుమార్, బి వెంకటేశ్, ఎస్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు.