Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశేషాదరణ పొందుతున్న గీతాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతికత, దానితోపాటు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అందుకనుగుణంగానే వివిధ యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు పురుడు పోసుకుంటున్నాయి. తద్వారా అవి ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని, వికాసాన్ని పంచుతున్నాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా... ఎంతో తాజాదనం, అప్డేట్తో కూడి, మధ్యలో ఎలాంటి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్ల గొడవ లేకుండా శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది 'తెలుగు ఫోక్' యాప్. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన జానపద గాయకులు పాడిన పాటలను, దైవభక్తి గీతాలను ఎప్పటికప్పుడు జనాలకు అందిస్తూ విశేషాదరణ పొందుతున్నది. దాదాపు రెండు వేలకు పైగా పాటలతో ఇంటిల్లిపాదినీ అలరిస్తూ ముందుకు సాగుతున్నది. దీంతోపాటు తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ఒగ్గు కథలను ఇది వెలుగులోకి తీసుకొస్తూ శభాష్ అనిపించుకుంటున్నది. అంతేగాక తెలంగాణ కామెడీకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రకరకాల స్క్రిప్టులను ఇది జనాల్లోకి వదులుతూ ఔరా... అనిపించుకుంటున్నది. ప్రస్తుతానికి తెలుగులోనే ఉన్న ఈ యాప్... రాబోయే రోజుల్లో భోజ్‌పురి, ఒరియా, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా తన సేవలందించనున్నది. ఈ యాప్‌ను ఆదరించి, ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నిర్వాహకుల్లో ఒకరైన ప్రకాశ్ కోరారు.