Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బిచ్కుంద
తన తండ్రి మరణించాడన్న వార్త విని పుట్టెడు దు:ఖం దిగమింగి ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. అహర్నిశలు కష్టపడి చదివిన చదువు వ్యర్థం కావొద్దని పదో తరగతి విద్యార్థిని పరీక్షకు హాజరై పరీక్ష రాసిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన వెన్నెల పదవ తరగతి చదువుతున్నది. వెన్నెల తండ్రి శేఖర్‌గా మారుతి తన బతుకు తెరువు, కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌లో కూలిపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం మారుతి అనారోగ్యానికి గురై మరణించాడు. తన తండ్రి మరణ వార్త విని వెన్నెల దు:ఖసాగరంలో మునిగిపోయింది. తండ్రి మరణించిన దు:ఖాన్ని, గుండెలోని బాధను దిగమింగి ఇరుగుపోరుగు వారి సూచనతో పరీక్షకు హాజరైంది. విద్యార్థిని వెన్నెలకు వచ్చిన కష్టాన్ని తలచుకొని స్థానికులు కంటతడిపెట్టుకున్నారు.