Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీపీఐ రాష్ట్ర మూడవ మహాసభలు సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్వహిస్తు న్నట్టు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. జులై 15 నుంచి ఆగస్టు 20వ తేదీ లోపు జిల్లా మహాసభలు పూర్తి చేయాలనీ, జూన్ 1నుంచి జులై వరకు మండల, పట్టణ మహాసభలు పూర్తి చేయాలని పార్టీ కేడర్‌కు సూచించారు. ఈనెల 23న మగ్దూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు సీపీఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరగనున్నాయనీ, ఆలోపు రాష్ట్ర, జిల్లా, మండల, శాఖా మహాసభల్ని పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేవాదళ్ ఇన్స్ట్రక్టర్స్ శిక్షణా శిబిరాన్ని జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు వరంగల్‌లో నిర్వహిస్తున్నా మన్నారు. జాతీయ సమితి తీర్మానం మేరకు బీజేపీ, ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, నియంతృత్వ, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక, ఫాసిస్టు వ్యతిరేక, విశాల వేదిక నిర్మాణానికి అన్ని స్థాయిలో కృషి కొనసాగించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలో పోడు భూములు, ధరణి పోర్టల్ ఇబ్బందులు, ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు, డబుల్ బెడ్రూంల సాధన, ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళితబంధు అమలు, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై నిరంతర ఆందోళనలు చేస్తామన్నారు. చమురుధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ వామపక్షపార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మే 27 మండల, పట్టణ స్థాయిల్లో, మే 30న జిల్లా కేంద్రాల్లో, మే 31న హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని వివరిచారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు.