Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాటసింగారం పండ్లమార్కెట్ వద్ద రైతులు ఇబ్బంది పడకుండా మెరుగైన వసతులు కల్పించాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం బాటసింగారం పండ్లమార్కెట్‌ను ఆయన సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ 22 ఎకరాల్లో బ్రహ్మాండంగా నడిచిందని గుర్తు చేశారు. రైతులు, ప్రజలకు అది అందుబాటులో ఉండేదని చెప్పారు. దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించొద్దంటూ హైకోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న షెడ్లను పడగొట్టిందని అన్నారు. ప్రత్యామ్నాయం చూపించకుండా బాటసింగారంకు పండ్ల మార్కెట్‌ను తరలించిందని వివరించారు. అక్కడ షెడ్లు, రోడ్డు, తాగునీరు, విద్యుత్, టారులెట్లు వంటి ఎలాంటి సౌకర్యాల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పండ్లు వస్తాయని చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ పండ్లమార్కెట్‌ను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపించకుండా, సరైన వసతులు కల్పించకుండా గడ్డిఅన్నారం నుంచి బాటసింగారానికి పండ్లమార్కెట్‌ను తరలించడం అన్యాయమని చెప్పారు. వసతుల్లేక అక్కడ రైతులు ఎండకు ఎండి, వానకు తడిసి ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన చెందుతున్నారని వివరించారు. అక్కడ రైతులకు యుద్ధప్రాతిపదికన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నాగిరెడ్డి, నాయకులు వి వెంకటేశ్వర్లు, ప్రమీల, శంకరయ్య, పండ్ల రైతు నాయకురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.