Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి పెండ్లినీ రిజిస్ట్రేషన్ చేయించాలి : చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాన-భువనగిరిరూరల్
మహిళలు, బాలికలకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న హక్కులను కాపాడటమే మహిళా హక్కుల కమిషన్ కమిషన్ బాధ్యత అని చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ మహిళా సంఘాలు, ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సెక్రెటరీలతో మంగళవారం 'మహిళా హక్కులు, సాధికారత'పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళల రక్షణ చట్టాలపై, హక్కులపై ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం, మహిళా సంఘాల సభ్యులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా చట్టాల గురించి కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలన్నారు. మహిళలు ఎక్కడ ఇబ్బందులకు గురవుతారో అక్కడికి వెళ్లి సుమోటోగా కేసు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాలు, వర్కింగ్ ఉమెన్ సెంటర్లు తనిఖీ చేసే అధికారం కమిషన్‌కు వుందని చెప్పారు. కుటుంబ వ్యవస్థలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారని, లింగ సమానత్వం లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. మహిళా రక్షణకు అనేక చట్టాలు తెచ్చారన్నారు. వరకట్న నిషేధ చట్టం, హిందూ వివాహ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, సీనియర్ సిటిజెన్ ప్రొటెక్షన్ మెయింటెనెన్స్ చట్టాలు తెచ్చారని వివరించారు. 108 సఖీ హెల్ప్ లైన్ ద్వారా, 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా లేదా పోస్టల్, ట్విట్టర్, ఈ మెయిల్ తదితర మార్గాల ద్వారా లేదా కమిషన్ నెంబర్ 9490555533కు మహిళలు సమస్యలను తెలియజేయొచ్చని, వారికి అండగా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు. మ్యారేజీ యాక్టు ప్రకారం ప్రతి పెండ్లినీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు మ్యారేజీ రిజిస్ట్రేషన్స్‌పై మహిళలను చైతన్యపరచాలని సూచించారు. జిల్లా లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టారని తెలిపారు. షీ టీంలు, సఖీ సెంటర్స్, సైబర్ టీం, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుతో మహిళలు మోసపోకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కమిషన్ నిర్వహించే బాధ్యతలను రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణవేణి వివరించారు. మహిళా సంఘం ప్రతినిధి ప్రశాంతి, జిల్లా బాలల సంక్షేమ కోఆర్డినేటర్ బండారు జయశ్రీ, సఖీ కేంద్రం కోఆర్డినేటర్ ప్రమీల, గ్రామీణ మహిళా రైతు సమితి అధ్యక్షులు విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద మహిళల హక్కులు, బాధ్యతలపై ప్రసంగించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, గృహ హింస సంబంధించిన రక్షణ చట్టాలపై హైకోర్టు అడ్వకేట్ మంజూష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అంతకుముందు చైర్పర్సన్, సభ్యులు పట్టణంలోని కృషి ఐటీఐ బాలికల వసతి గృహాన్ని, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. భోజన వసతులను పరిశీలించారు. సఖీ సెంటర్‌ను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్మ ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్ధం లక్ష్మి, కటారి రేవతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.