Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు, సీపీఐ(ఎం) నేతలకు వినతి
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పుటానీ తండా గ్రామపంచాయతీ సమీపంలో కుక్కల గుట్టను అగ్రకులాల వాళ్లు కబ్జా చేస్తున్నారని, వాటిని కాపాడాలని కోరుతూ గ్రామ రైతులు మంత్రులకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఖమ్మం విచ్చేసిన గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌కు ఖమ్మంలోని బంజారా భవన్లో ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం గిరిజన శాఖ మంత్రికి సమస్యను వివరించారు. ఈర్లపుడి రెవెన్యూ పరిధిలోని 100 సర్వేనెంబర్లో మొత్తం 170.29 విస్తీర్ణం ఉన్న భూమిలో 50 ఏండ్లుగా గిరిజన పేద రైతులు సాగు చేస్తున్నారని, ఈ సాగు భూమి సమీపంలో మట్టి గుట్ట ఉందని, ఈ గుట్టను ఎలాగైనా కాజేయాలని కుట్ర పన్నుతున్నారని తెలిపారు.
50 ఏండ్ల కిందట నుంచి తమ తాతలు శిస్తులు కట్టిన రసీదులు సైతం తహసీల్దార్‌కు ఇచ్చామన్నారు. అప్పటి నుండి భూములు మా పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2017లో గిరిజన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందని తెలిపారు. అలాంటి భూములను తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత రికార్డులు సేకరించి కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ నోటీసులు ఇచ్చి రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. కలిసిన వారిలో గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్య కృష్ణ, గిరిజన సంఘం మండల అధ్యక్షులు కుమార్, భానోతు రమేష్ నాయక్, రైతులు ఉన్నారు.