Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాత్కాలిక పర్మిట్లతో యథేచ్ఛగా తవ్వకాలు
- అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న గుట్టలు
- అక్రమ క్వారీయింగ్ వెనుక అధికార పార్టీ నేతల హస్తం!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఏ నిర్మాణం చేపట్టాలన్నా మట్టితోనే పని. విపరీతంగా నిర్మాణాలు పెరుగుతుండటంతో క్రమేణా మట్టి గుట్టలు అంతరిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా మట్టి లభించకపోవడంతో అక్రమార్కులు దాన్ని సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి. అధికారపార్టీ కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఖమ్మంలో ప్లాట్లు, వెంచర్లు, ఇండ్లు, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం భారీగా సాగుతుండటంతో మట్టి ఆవశ్యకత అధికమైంది. వీటిలో ఏ ఒక్కటి చేపట్టాలన్నా మట్టితోనే మొదట పని. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు కొందరు గుట్టలను గుట్కాయస్వాహా చేసి.. మట్టితో కోట్లు దండుకుంటున్నారని.. ఇంకా పలువురు ఇదే ప్రయత్నంలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోని అనేక గుట్టలను 'అధికారం' మాటున స్వాహా చేసి.. రూ.కోట్లు కొల్లగొడుతున్నారనే అభియోగాలు న్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురంలోనూ వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రముఖ అధికార పార్టీ నేత ఇలాగే వేపులగుట్టను నామరూపాలు లేకుండా దోచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ అధికారులు కూడా అక్రమార్కులకు వంత పాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలోనూ ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనధికారికంగా 50కి పైనే...
ఖమ్మం జిల్లాలో మట్టి తవ్వకాల కోసం అనుమతి ఉన్న క్వారీలు 12 మాత్రమే ఉన్నాయి. వాటిలో ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణం కోసం ఐదు కంపెనీలకు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. మరో ఏడు ఇతర క్వారీలకు సైతం తాత్కాలిక అనుమతులున్నాయి. ఈ అనుమతిని ఏటా రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అవి ఎక్కడా ఆచరణలో పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో అనధికారికంగా జిల్లాలో 50కి పైగానే క్వారీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో నేషనల్ హైవే అవసరాల కోసం తల్లాడ మండలం బాలపేట వద్ద 4 క్వారీలు, మధిర మండలం ఎండపల్లి వద్ద ఒక క్వారీకి అనుమతులున్నాయి. ఖమ్మం అర్బన్‌లోని బాలపేట, ఏన్కూరు మండలం గార్లొడ్డు, ఖమ్మం రూరల్‌లోని గూడూరుపాడు, తిరుమలాయపాలెం మండలకేంద్రంతో పాటు వెదుళ్లచెరువు, ముదిగొండ మండలం ఖానాపురం, మండ్రేగుపల్లి క్వారీలకు అనుమతులున్నాయి. వీటి పరిసరాల్లోని అసైన్డ్, అటవీ, ఇనాం, పట్టా, బంజర భూముల్లోనూ అక్రమ తవ్వంకాలు కొనసాగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరో ఆసక్తికర విషయమేమంటే గతేడాది వరకు ఖమ్మం జిల్లాలో ఒక క్వారీకి మాత్రమే అనుమతి ఉంది. కానీ దాన్ని ఆధారం చేసుకుని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలు చేపట్టారని రూ.16 కోట్లు మైనింగ్‌శాఖ ఫైన్ విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అనుమతిదారులు కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది.
మార్కెట్ మట్టినీ కాజేస్తున్నారు...!
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో కొందరు అధికార పార్టీ నేతల పేరుచెప్పి నూతనంగా రూ.19 కోట్ల వ్యవయంతో నిర్మాణం ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ మట్టినీ కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నిర్మాణం కోసం నేలను చదును చేసే క్రమంలో భారీ మొత్తంలో మట్టి బయటకొస్తుంది. ఇలా వచ్చిన మట్టిని నిల్వచేసి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించాల్సి ఉండగా నూతన వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కొందరు అధికారం మాటున అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. ఒక్కో ట్రాక్టర్ ట్రక్కుమట్టి రూ.600-800, టిప్పర్ రూ.3000-4000చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.
మట్టి కోసమే గుట్టలపై చూపు..!
రఘునాథపాలెం మండలం ఈర్లపూడి రెవెన్యూ సర్వేనంబర్ 100లో సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుక్కలగుట్టపై రూ.వందల కోట్ల విలువ చేసే మట్టి ఉంది. పుఠాన్తండా, రాంక్యాతండా తదితర తండాలకు చెందిన గిరిజనులు ఈ గుట్టపై, గుట్ట పరిసరాల్లో పట్టాలు కలిగి వున్నారు. కానీ ఓ అధికార పార్టీ నేత గుట్టపై కన్నేశారు. గుట్టను ఎలాగోలా కొల్లగొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పట్టాలున్న 24 మంది గిరిజనులకు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. సర్వే నంబర్ 100లో సెంటు భూమిలేకపోయినా అధికారం మాటున గిరిజనులను భయబ్రాంతులకు గురిచేయాలని ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాలు బెడికొట్టాయి. గిరిజనులు పట్టా కలిగి ఉన్న సాగు భూములు వారివి వారికి వదిలేసినా గుట్టపై వారికి హక్కు ఎక్కడిదీ అని శంకర్రావు అనే వ్యక్తి వాదిస్తున్నారు. కేవలం రూ.కోట్ల విలువ చేసే మట్టి కోసమే శంకర్రావు అండ్ కో ఈ విశ్వయత్నాలు చేస్తున్నట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రముఖ నేత ఒకరి అండతో వేపులగుట్టను నామరూపాలు లేకుండా తొలిచేశారు. సర్వేనంబర్ 126/83 పట్టాల్యాండ్ అనే పేరుతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టమట్టిని అధికారుల అండదండలతో సాంతం తరలించారనే ఆరోపణలున్నాయి. భద్రాద్రి జిల్లాలో అనేక చోట్ల అటవీభూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
నిబంధనల మేరకే అనుమతులు: సంజయ్ కుమార్, మైనింగ్ ఏడీ
నిబంధనల మేరకు దరఖాస్తులు ఉంటేనే తాత్కాలిక అనుమతులిస్తున్నాం. మైనింగ్ డీడీ ద్వారా తమకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్‌కు పంపి..వారు ఎన్వోసీ ఇచ్చాకే పర్మిషన్ ఇస్తున్నాం. అక్రమంగా మట్టి తరలించకుండా తహశీల్దార్ కన్వీనర్‌గా మండలానికో టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశాం. ప్రయివేటు భూముల్లో నుంచి మట్టి తరలించాలన్నా నిబంధనలు పాటించాల్సిందే...అనుమతులు ఉండాల్సిందే.