Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇలాంటి మాటలు, చర్యలను తీవ్రంగా ఖండించండి
- బండి సంజయ్ తవ్వకాల వ్యాఖ్యలపై తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో ఎలాగైనాసరే అధికారంలోకి రావాలనే యావతో ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజరు ఇదే కోవలో కరీంనగర్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు, చర్యలను తీవ్రంగా ఖండించాలని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'హిందూ ఏకతా యాత్ర.. దాని హెడ్డింగే తప్పు. సమస్యలపై ప్రజల్ని ఏకం చేయాలి, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేయాలి, అభివృద్ధి కోసం ప్రజల్ని ఏకం చేయాలి... అంతే తప్ప మతం కోసం ఏకం చేయటమనేది మత గురువులు చేసుకుంటారు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా బండి సంజరు అలాంటి యాత్రలు చేయటం తప్పు. రెండోది దానికొక సాధ్వీపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీని పిలిచారు. ఆ పరిషత్ ఏంటో, అది ఎందుకు ఉందో..? ఏ మఠమో తెలియదు. ఆయన డైరెక్టుగా బండి సంజరు అధికారంలోకి వస్తే దేవాలయాలు బాగుపడతాయి.. మతం బాగుపడుతుంది.. మొత్తం దేశం బాగుపడుతుందంటూ చెప్పారు. ఇదంతా ఒక కిరాయి గుంపులాగా కనబడుతుంది తప్ప కనీసం హిందూమత ప్రాతిపదిక కూడా దానికి కనబడటం లేదు. హిందూ మతాన్ని వాడుకుంటున్నారు తప్ప వేరేదేమీ కాదు. హిందూ మతస్తులు ఈ తతంగాన్ని చూసి అసహ్యించుకోవాలి తప్ప అదేదో హిందూ మతం కోసం వచ్చిన యాత్ర అనుకుంటే పొరపాటు. మరోవైపు వీళ్లు చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మసీదులన్నీ తవ్వాలి, వాటిలో శవాలు బయటపడితే మీవి, శివలింగాలు బయటపడితే మావంటూ మాట్లాడటం చట్ట విరుద్ధం. శివలింగాలు ఎందుకు బయటపడుతు న్నాయో, దాంట్లోని తంత్రమేంటో అందరికీ తెలుసు. అందువల్ల ఇలాంటి వివాదాలను రెచ్చగొట్టటం, మత ఘర్షణలు లేపటం ద్వారా బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పెరిగిన తీరు అదే. తెలంగాణలో కూడా ఆ పద్ధతుల్లోనే అది ప్రయత్నిస్తున్నది. ఈ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. 1991లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పార్లమెంటు ఒక చట్టం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న పొసెషన్ను యధాతథంగా ఉంచాలి.. గుళ్లు, మసీదులు, ఇంకేదైనా ప్రార్థనా స్థలాలను విధ్వంసం చేయటం, మత విద్వేషాలను రెచ్చగొట్టటమనేది రాజ్యాంగ విరుద్ధమంటూ చట్టం చేశారు. ఇప్పుడు ఆ చట్టాన్ని తిరగదోడి అన్నింటినీ తవ్వాలని చెప్పటమనేది అత్యంత ఆందోళనకరం, ప్రమాదకరం. సాయుధ పోరాట కాలం నుంచి ఒక సెక్యులర్ విలువలతో, హిందూ ముస్లింలు అందరూ ఏకమై, రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి పునీతమైన గడ్డ తెలంగాణ. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా జరిపిన పోరాటమది. దాన్ని కూడా హిందూ, ముస్లిం మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించిన పార్టీ బీజేపీ. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనే యావతో ఇదంతా చేస్తున్నారు.
ఇందుకోసం మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలాంటి చర్యలను, కుట్రలను సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మొత్తం తెలంగాణ సమాజం కోసం కూడా దీన్ని ఖండించాలనీ, ఇలాంటి చర్యలను సాగనివ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం....' అని తమ్మినేని పేర్కొన్నారు.