Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సున్నా ప్రవేశాలున్న 54 కళాశాలల మూసివేత
- మూడేండ్లుగా ఇదే పరిస్థితి
- 15 మందిలోపు విద్యార్థులున్న కోర్సులు రద్దు
- వీసీలకు ఉన్నత విద్యామండలి ఆదేశం
- కన్వర్షన్కు 130 కాలేజీల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలపై వేటుకు రంగం సిద్ధమైంది. 54 ప్రయివేటు డిగ్రీ కళాశాలల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయి. మూడు విద్యాసంవత్సరాలుగా వాటిలో ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం. విద్యార్థులు చేరకుంటే చర్యలు తీసుకుంటామంటూ ఏటా ఉన్నత విద్యామండలి కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా వాటి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో 54 డిగ్రీ కాలేజీలను మూసివేయాలనీ, లేదంటే వచ్చే విద్యాసంవత్సరం (2022-23)లో అనుబంధ గుర్తింపును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వీసీలకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల భవనాలు, తరగతి గదులు, మౌలిక వసతులు, అర్హులైన అధ్యాపకులు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాలతో విద్యార్థులెవరూ చేరేందుకు ముందుకు రావడం లేదు. వాటిలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాల్లేవు. ఇంకోవైపు డిగ్రీ కాలేజీలు ప్రమాదంలో పడ్డాయి. 30 మంది విద్యార్థుల్లోపు 184 కాలేజీలు, 50 మంది విద్యార్థుల్లోపు సుమారు 250 కాలేజీలుండడం గమనార్హం. ఇంకోవైపు 15 మంది విద్యార్థులున్న కోర్సులను సైతం రద్దు చేయాలని నిర్ణయించింది. ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేయాలంటూ వీసీలను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. విద్యార్థులు తక్కువున్న కోర్సులను కన్వర్షన్ చేసుకునేందుకు సుమారు 130 కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశాయి. ఆయా కాలేజీలున్న ప్రాంతాలు, వాటి పనితీరు, అవసరం, విద్యార్థుల ప్రవేశాల ఆధారంగా వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
భారీగా మిగులుతున్న సీట్లు
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. అందులో ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువ మిగులుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2021-22)లో 1065 డిగ్రీ కాలేజీల్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 2,73,526 (58.65 శాతం) మంది విద్యార్థులు చేరారు. 1,92,819 (41.35 శాతం) సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో గురుకులాలతో కలిపి 187 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 878 ప్రయివేటు డిగ్రీ కాలేజీలున్నాయి. 878 ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో 3,39,110 సీట్లుంటే, 1,74,596 (51.43 శాతం) మంది విద్యార్థులు చేరారు. 1,64,714 (48.57 శాతం) సీట్లు మిగిలాయి. 2020-21 విద్యాసంవత్సరంలో 1103 డిగ్రీ కాలేజీల్లో 4,54,703 సీట్లకుగాను 2,47,601 మంది ప్రవేశం పొందారు. అంటే 2,07,102 సీట్లు మిగిలాయి. ఇందులో 855 ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో 3,36,070 సీట్లకుగాను, 1,73,550 (51.64 శాతం) మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 1,62,520 (48.36 శాతం) సీట్లు మిగిలాయి.
వంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు : లింబాద్రి
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 70 శాతం వరకు సీట్లలో విద్యార్థులు చేరుతున్నారని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, అధ్యాపకులను అందుబాటులో ఉంచడం, మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తెలంగాణ వచ్చిన సమయంలో 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉండేందన్నారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల ప్రస్తుతం వంద కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉందని చెప్పారు. నిజాం, సిటీ, కోఠి, బేగంపేట మహిళా కాలేజీల్లో డిగ్రీ విద్యార్థులు 70 నుంచి 80 కోర్సుల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అన్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానం వల్ల ఆర్ట్స్ విద్యార్థులు, సైన్స్ సబ్జెక్టులను, సైన్స్ విద్యార్థులు ఆర్ట్స్, కామర్స్ కోర్సులను ఎంచుకునేందుకు అవకాశముందని చెప్పారు. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో 2,73,526 మంది విద్యార్థులు చేరడం మంచి పరిణామమని అన్నారు. విద్యార్థులు చేరిక రాష్ట్ర గ్రాస్ ఎన్రోల్మెట్ రేషియో (జీఈఆర్) పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు.