Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి ముట్టడి
- ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత
- విపక్షాల మద్దతు-నేతల అరెస్ట్
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
'కుడా' ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌కు సంబంధించి జీఓ నెంబర్ 80ఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కరుణపురం వద్ద రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జేఏసీ జాతీయ రహదారిపై రాస్తారోకోకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం నుంచే పలువురు రైతు సంఘాల నాయకులను, రైతులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ధర్మసాగర్, జఫర్‌గఢ్, ఐనవోలు మండలాల రైతులు పెద్దసంఖ్యలో రాస్తారోకోకు తరలివచ్చారు.
జఫర్‌గఢ్ మండలంలోని రఘునాథపల్లిలో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా వాగ్వాదం జరిగింది. 'మాకున్న ఎకరం, రెండెకరాలు ల్యాండ్ పూలింగ్‌కు తీసుకుంటే మేం, మా పిల్లలు ఏం కావాలి ?' అంటూ ప్రశ్నించారు. మా భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పినా ప్రభుత్వం ఎందుకు జీవో రద్దు చేయడం లేదు ? అని నిలదీశారు. ఈ విషయంలో పోలీసులు తమకు సహకరించాలని రైతులు కోరారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఉదయమే ఐనవోలు మండలం పున్నేల్, వెంకటాపురం, జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామాల్లో రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలు గ్రామాల్లో తోపులాటలు, వాగ్వివాదాలు జరిగాయి.
భారీగా పోలీసుల మోహరింపు
కరుణపురం వద్ద ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా, జీవో 80ఏను రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన రాస్తారోకో నేపథ్యంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. గ్రామాల నుంచి రైతులు పోలీసులను తప్పించుకుని పెద్దఎత్తున రాస్తారోకోలో పాల్గొన్నారు. ఆందోళనకు దిగిన రైతులు సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
విపక్షాల మద్దతు
రైతుల రాస్తారోకోకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, పద్మ, సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, నాయకులు మండల సంపత్, రైతు సంఘం నాయకులు బండి పర్వ తాలు తదితరులు రైతుల పోరాటానికి మద్దతు పలికి రాస్తా రోకోలో పాల్గొన్నారు. అయితే, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఆందోళన చేస్తున్న నేతలు, రైతు జాక్ నేతలు, విపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జీఓ నెంబర్ 80ఏను రద్దు చేయాలి: బొమ్మినేని రవీందర్‌రెడ్డి
రాస్తారోకోను భగం చేయడానికి ప్రభుత్వం పోలీసులనుపయోగించి రైతులను అరెస్టు చేయించింది. వెంటనే రైతులందరినీ విడుదల చేయాలి. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీఓను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తం.