Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలి: బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
నవతెలంగాణ-కరీంనగర్టౌన్
దేశంలో ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి.. తెలంగాణలో కూడా మసీదులు తవ్వడానికి సిద్ధమా.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సవాల్ విసిరారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న బండి సంజరు మతవిద్వేష.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా, వేములవాడలో గుడిలో ఉన్న దర్గా పోవాలన్నా రామరాజ్యం రావాల్సిందే అన్నారు. ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారని, త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తింపజేస్తామని అన్నారు. అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామని చెప్పారు. దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారని ఆరోపించారు.