Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ ప్రభుత్వాలు అవినీతిపై పోరాటంలో భాగంగా అమలు చేస్తున్న జీరో టాలరెన్స్ ఆఫ్ కరప్షన్ పద్ధతిని తెలంగాణలోనూ అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి బుధవారం లేఖ రాశారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ పనులలో కమీషన్లు పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో దృష్టి సారించి ఉక్కుపాదం మోపాలని సూచించారు. అవినీతిని అరికట్టి ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. ప్రతిపక్షాలు కోరకున్నా, పత్రికల్లో వార్తలు రాకున్నా నిఘావర్గాల సమాచారం ఆధారంగా వైద్యశాఖ మంత్రిపై పంజాబ్ సీఎం చర్యలు తీసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. దేశరాజకీయాల్లో ఆప్ కొత్త అధ్యయనానికి తెరలేపిందని పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో సర్కారు బడులు, బస్తీ దవాఖానాల నిర్వహణ బాగుందనీ, వాటిని తెలంగాణలోనూ అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే జీరో టాలరెన్స్ ఆఫ్ కరప్షన్ పద్ధతిని అమలు చేయాలని కోరారు.