Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఒక ఫారెస్టు రేంజీ ఆఫీసర్‌తో పాటు మరో ఫీల్డ్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ కే. శ్యాంకుమార్‌తో పాటు ఫారెస్టు ఫీల్డ్ ఆఫీసర్ పెరియా నాయక్‌లు వారి కార్యాలయం వద్ద బుధవారం రూ. 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మత్తయ్య అనే వ్యక్తికి టింబర్ డిపో లైసెన్స్‌ను ఇవ్వడానికి గానూ రూ. 80 వేలను శ్యాంకుమార్ డిమాండ్ చేశారు. ఈ డబ్బులను పెరియా నాయక్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చినట్టు అంజనీ కుమార్ తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు ఆయన చెప్పారు.
భైంసా తహసీల్దార్ అక్రమాస్థులు కోటి రూపాయల పైనే..!
అవినీతి అక్రమాలకు పాల్పడిన నిర్మల్ జిల్లా భైంసా మండల తహసీల్దార్ నరేందర్ కోటి రూపాయల పైనే అక్రమాస్థులు సంపాదించినట్టు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నరేందర్ అవినీతి, అక్రమాలకు పాల్పడి భారీ మొత్తంలో అక్రమాస్థులను కూడగట్టినట్టు ఏసీబీకి సమాచారమందింది. దీంతో ఏసీబీ అధికారులు అతని ఆస్థులపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1,16,00, 314 విలువైన అక్రమాస్థులను నరేందర్ కలిగి ఉన్నట్టు బయటపడింది. అంతేగాక, అంతని ఇంటి నుంచి రూ. 1.34 లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇతను తహసీల్దార్‌గా పని చేసిన ఏరియాల్లో సైతం అవినీతికి పాల్పడినట్టు ఏసీబీకి సమాచారమున్నది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని అంజనీ కుమార్ తెలిపారు.