Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడున్న 8 లక్షల మంది కార్మికులను పర్మినెంట్ చేయాలి
- ప్రయివేటీకరణ వద్దు
- డిమాండ్ల సాధన కోసం ఐక్యపోరాటాలు
- నేడు ఎస్వీకేలో అఖిలభారత ప్రతినిధుల సమావేశం
- 'నవతెలంగాణ'తో రైల్వే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్
కోఆర్డినేషన్ కమిటీ జాతీయ కన్వీనర్ దిట్టకవి రమేష్‌బాబు
''రైల్వేలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమదోపిడీకి అడ్డూ అదుపూ లేదు. సంఘటితం అయ్యే ప్రయత్నం చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. తీవ్రమైన నిర్భంధాల మధ్య, కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు 8 లక్షల మంది కార్మికులు కాంట్రాక్టర్ల ద్వారా రైల్వేలో పనిచేస్తున్నారు. వీరందరినీ పర్మినెంట్ చేయాలి. అన్ని ఖాళీ పోస్టుల్ని తక్షణం భర్తీ చేయాలి. దానికోసం త్వరలో రైల్వేమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కచ్చితంగా రైల్వేలో కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగి తీరాలి. దానికోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంటాం'' రైల్వే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ అఖిల భారత కన్వీనర్ దిట్టకవి రమేష్‌బాబు నిశ్చితాభిప్రాయాలు ఇవి. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగనుంది. పలు రాష్ట్రాల ప్రతినిధులు దీనిలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల స్థితిగతులపై ఆయన తన అభిప్రాయాలను 'నవతెలంగాణ'తో పంచుకున్నారు.
రైల్వేలో కాంట్రాక్ట్ కార్మికుల పనివిధానం ఎలా ఉంది?
దారుణంగా ఉంది. వారికి కనీస వేతనాలు, సౌకర్యాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ వంటివి ఏవీ లేవు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కనీస నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. రైల్వేకు సంబంధం లేదంటున్నారు. పూర్తిగా శ్రమదోపిడీ జరుగుతుంది. ఇదేమని ప్రశ్నిస్తూ, ఎక్కడైనా కార్మికులు సంఘటితమయ్యే ప్రయత్నం చేస్తే, నిర్దాక్షిణ్యంగా వారిని పనిలో నుంచి తొలగిస్తున్నారు. ఆ భయానికి కాంట్రాక్ట్ కార్మికులు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా, కండ్లలో నీళ్లు కుక్కుకుంటూ వెట్టిచాకిరీ చేస్తున్నారు.
మరి రైల్వే మంత్రిత్వశాఖ ఏం చేస్తుంది?
ప్యాకేజీల వారీగా రైల్వే పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించి, చేతులు దులుపుకుంటోంది. కనీసం రైల్వే అధికారుల వద్ద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రిజిస్టర్ కూడా లేదు. కనీస సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించట్లేదు. దాన్ని గుర్తు చేయడం కోసమే ఇప్పుడు మేం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. దానిలో భాగంగా తొలుత రైల్వేమంత్రికి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, డిమాండ్లు, పరిష్కారాలను సూచిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఏఏ విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు?
ఏసీ కోచ్‌లు, రైల్వే స్టేషన్ల పరిశుభ్రత, గూడ్స్ షెడ్లు, లోడింగ్, అన్లోడింగ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) నిర్వహిస్తున్న రైల్వే క్యాంటీన్లు, సివిల్ వర్క్‌లు సహా పలు విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.
మహిళా కాంట్రాక్ట్ వర్కర్ల పరిస్థితి ఎలా ఉంది?
దుర్భరంగా ఉంది. అవమానాలు, వేధింపులు, కన్నీళ్ల దిగమింగుకొని పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రైల్వే కాంట్రాక్టర్లు, అధికారులు వారిని లైంగిక వేధింపులకూ గురిచేస్తున్నారు. వారికోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటివి లేవు. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వారు చేతులతోనే చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కనీసం గ్లౌజులు, చీపుర్లు కూడా ఇవ్వట్లేదు. అదేమని ప్రశ్నిస్తే రేపటి నుంచి పనికి రావొద్దు అని నిర్దయగా చెప్పేస్తున్నారు.
యూనియన్లుగా మీరేం చేస్తున్నారు?
మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. అసలు రైల్వేలో కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల నిర్మాణమే మాముందున్న అతిపెద్ద సవాలు. ఎవరైనా సంఘ కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిస్తే, తెల్లారే వాళ్లను పనుల్లోంచి తీసేస్తున్నారు. ఇతర యూనియన్లతో కలిసి ఐక్య కార్యాచరణకూ ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో మార్పు తెస్తేనే, కాంట్రాక్ట్ కార్మికులకు ఎంతోకొంత న్యాయం జరుగుతుంది. మా ప్రయత్నం ఆ దిశగా సాగుతున్నది.
మీ డిమాండ్లు ఏంటి ?
కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలి. పని ప్రదేశాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి.
కేంద్రప్రభుత్వం రైళ్లు, రైల్వే స్టేషన్లనే ప్రయివేటుపరం చేస్తుంటే, మీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని వింటారా?
రైల్వేను ప్రయివేటుపరంచేస్తూ చేతులు కాల్చుకుంటున్నా కేంద్రానికి ఇంకా గుణపాఠం రాలేదు. ఢిల్లీ - లక్నో మధ్య తేజాస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రయివేటు రైళ్లను ప్రవేశపెట్టారు. వాళ్లు టిక్కెట్ రేట్లు విపరీతంగా పెంచడంతో ప్రజలు ఆ రైళ్లు ఎక్కడం మానేశారు. దీనితో నష్టాలు వస్తున్నాయని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలే అనేకం జరిగాయి. అయినా కేంద్రానికి కనువిప్పు కలగట్లేదు. మరో రూపంలో మళ్లీ ప్రయివేటుకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంది. కేవలం లాభాలు వచ్చే రూట్లనే ప్రయివేటుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రైల్వేలో ఖాళీ పోస్టుల భర్తీ జరుగుతున్నదా?
లేదు. ఈ విషయాన్ని స్వయానా రైల్వేమంత్రే పార్లమెంటుకు తెలిపారు. రిక్రూట్మెంట్ కేడర్‌లో 1.49 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. గ్రూప్-సీ, డీ కేటగిరీల్లో 2019 నుంచి రిక్రూట్మెంటే లేదు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఖాళీలు ఉంచి, ఆ పనుల్ని కాంట్రాక్లర్లకు ఇచ్చి, కాంట్రాక్ట్ వర్కర్లతో చేయించుకుంటోంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నియామకాల ప్రక్రియ సుదీర్ఘమైంది. ఒక్క పోస్టు భర్తీ చేయాలంటే కనీసం రెండేండ్లు టైం తీసుకుంటుంది. ఈ విధానంలో మార్పు రావాలి.
హైదరాబాద్‌లో జరిగే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు?
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, పరిష్కారాలు, యూనియన్ విస్తరణ, ఎదురయ్యే అవరోథాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ చర్చల సారాంశాన్ని, ప్రతిపాదనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి కార్యాచరణను రూపొందిస్తాం.