Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు గీతారెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలోని బస్తీ దవాఖానాలను తిరిగి పరిశీలించిన సీఎం కేసీఆర్...హైదరాబాద్లోని బస్తీ దవాఖానాలను ఎందుకు సందర్శించలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జె గీతారెడ్డి ప్రశ్నించారు. కరోనా సమయంలో టిమ్స్ ఆస్పత్రికి కోట్లు ఖర్చుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నేడు వాటిని మూసేయడమేంటని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్కు ఆరోగ్య సమస్య వస్తే ప్రయివేటు ఆస్పత్రికి వెళ్తాడు తప్ప ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకు వెళ్లరని నిలదీశారు.దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యత లోపించిందని సీఎం పరోక్షంగా ఒప్పుకున్నట్టేనన్నారు. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తానంటూ హామీ ఇచ్చినా అది అమలు కాలేదని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజి హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి 100పడకల ఆస్పత్రి, మండలానికి 30పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్పత్రులు తప్ప కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఆస్పత్రి కూడా నిర్మించలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల కంటే ముందే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీటిపై స్పందించకుంటే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేయకుండా నిర్వీర్యం చేస్తున్నారనీ, పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు.