Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దావోస్‌లో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అన్ని ప్రాంతాలకూ విస్తరింపచేసేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో స్టాడ్లర్ రైల్ సంస్థ కోచ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అవగాహనా ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 2,500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రానికి చెందిన మేధో సర్వీస్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని స్థాపిస్తాయని వివరించారు. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అన్స్ గార్డ్ బ్రోక్ మెరు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పరస్పరం మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు పెట్టారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే రైల్ కోచ్‌లు భారత దేశంతోపాటు ఆసియా పసిఫిక్ రీజియన్‌కు ఎగుమతి చేస్తాయని తెలిపారు. అలాగే ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ రాష్ట్రంలో మరో అదనపు యూనిట్ స్థాపించేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల వెయ్యి నూతన ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నదనీ, దాన్ని మరింత విస్తరించనున్నామనీ వివరించారు. నూతన తయారీ ప్లాంట్ నుంచి ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఫెర్రింగ్ ఫార్మా ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అల్లేసండ్రో గిలియో ప్రతినిధి బందం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యింది. నెల క్రితం తాము హైదరాబాద్‌లో యూనిట్ నెలకొల్పామనీ, ఇప్పుడు దాన్ని మరింత విస్తరింపచేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.