Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మోసం
-10 లక్షలు వసూలు
- బీహార్‌కు చెందిన నిందితుడి అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నీట్ విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ లక్షలు వసూళ్లు చేసిన నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం బీర్పూర్కు చెందిన అశోక్‌షా సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. నీట్ పరీక్షలు రాసి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న వారిని టార్గెట్ చేశాడు. ఆన్లైన్లో వివరాలు సేకరించాడు. మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ అభ్యర్థులను ఫోన్లో, ఈ మెయిల్ ద్వారా సంప్రదించాడు. ఇదే తరహాలో హైదరాబాద్ నగరానికి చెందిన వై.వెన్నెలను టార్గెట్ చేశాడు. నీట్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బెంగళూరులోని కిమ్స్ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని ఆమె సెల్‌కు మెసేజ్ వచ్చింది. మాయమాటలతో ఆమె తల్లిదండ్రులను దుండగులు నమ్మించారు. రూ.10 లక్షల 16 వేలను వివిధ బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. మోసపోయినట్టు గుర్తించిన బాధితులు ఏప్రిల్ 21న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పరారీలోవున్న నిందితుడిని బీహార్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎవరైనా మెడికల్ సీట్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మొద్దని జాయింట్ సీపీ సూచించారు. కౌన్సెలింగ్ ద్వారానే మెడికల్ సీట్లు వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తోపాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.