Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు టీఏఎఫ్ఆర్సీ కీలక సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఎంత ఉండాలనే దానిపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గురువారం కీలక సమావేశం జరగనున్నది. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రితోపాటు ఇతర సభ్యులు పాల్గొంటారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నియమించిన శ్రీకృష్ణ కమిటీ పలు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది. వాటిని కేంద్రంలో ఎంహెచ్ఆర్డీ ఆమోదించింది. దీంతో అవే ఫీజులను అమలు చేయాలా? లేక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా టీఏఎఫ్ఆర్సీ కొత్త ఫీజులను ఖరారు చేయాలా? అనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన, కరోనా పరిస్థితులు, విద్యారంగంలో వస్తున్న పరిణామాలు, కాలేజీల ఆదాయ, వ్యయాలు, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై లోతుగా పరిశీలించి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనల ప్రకారమే ఫీజులుండాలా? లేక రాష్ట్రంలో వేరే ఫీజులను ఖరారు చేయాలా? అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కావాల్సి ఉన్నది. దానిపై స్పష్టత వచ్చాక ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కాలేజీలతో సంప్రదింపులు జరపాలా? వద్దా? అనేది తెలుస్తుంది. ఈనెల 16 నుంచి కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ సంప్రదింపులు నిర్వహించింది. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు రావడంతో ఈనెల 19న కాలేజీలతో సంప్రదింపుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గురువారం జరిగే టీఏఎఫ్ఆర్సీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీకృష్ణ కమిటీ ఫీజు ప్రతిపాదనలు
కోర్సు కనీస ఫీజు గరిష్ట ఫీజు
డిప్లొమా
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (పాలిటెక్నిక్) రూ.67,900 రూ.1,40,900
అప్లయిడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రూ.81,900 రూ.1,64,700
డిజైన్ రూ.82,500 రూ.1,61,500
హోటల్ మేనేజ్మెంట్ రూ.67,900 రూ.1,47,800
యూజీ డిగ్రీ
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రూ.79,600 రూ.1,89,800
ప్లానింగ్ రూ.72,000 రూ.2,16,100
అప్లయిడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రూ.1,49,300 రూ.3,67,900
డిజైన్ రూ.1,33,500 రూ.3,30,500
హోటల్ మేనేజ్మెంట్ రూ.81,300 రూ.1,91,200
పీజీ డిగ్రీ
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రూ.1,41,200 రూ.3,04,000
ప్లానింగ్ రూ.2,11,900 రూ.4,50,200
అప్లయిడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రూ.2,20,200 రూ.4,49,900
డిజైన్ రూ.2,63,500 రూ.5,57,100
హోటల్ మేనేజ్మెంట్ రూ.1,83,400 రూ.3,78,400
ఎంసీఏ రూ.88,500 రూ.1,94,100
మేనేజ్మెంట్ రూ.85,000 రూ.1,95,200