Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ హితబోధ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆ జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం కేసీఆర్ హితబోధ చేశారు. ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించిన నేపథ్యంలో టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ను బుధవారం ప్రగతి భవన్లో కలిశారు. ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సీఎం కేసీఆర్ను కుటుంబ సమేతంగా కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అశ్వారావుపేటలో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశాలు జారీచేశామని సీఎం చెప్పినట్టు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జిల్లా నేతలకు పలు కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా ప్రగతి కొరకు నిధులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిందని గుర్తు చేశారన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీఎంను కలిసిన వారిలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, రాజ్యసభ అభ్యర్థి బండి పార్థసారధిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉన్నారు.