Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెడితే సహించకపోవడం దారుణం
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు
- ఆధిపత్య శక్తుల దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడిన కుల గజ్జి మూర్ఖుల కుట్రలను తిప్పికొట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో అగ్రకుల ఆధిపత్య శక్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖుల పేర్లు పెట్టారనీ, అక్కడ లేని అభ్యంతరం కోనసీమ జిల్లాలకు అంబేద్కర్ పేరు పెడితేనే ఎందుకొచ్చిందని నిలదీశారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని మతోన్మాద, కులగజ్జి శక్తులు జీర్ణించుకోలేక నానా రాద్ధాంతం చేస్తూ హింసకు పాల్పడుతు న్నాయని విమర్శించారు. ప్రజల్లో విద్వేషాలు రగిల్చి రెచ్చగొడుతున్న మూర్ఖులను వెంటనే అరెస్లు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు, పోలీసు యంత్రాంగం సంయమనం పాటించి శాంతి సామరస్యాలను కాపాడాలని వేడుకున్నారు. విద్వేషాలు రగిల్చే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ.. అమలాపురంలో శాంతిభద్రతలను కాపాడాలనీ, ఈ ఘటన వెనుక ఉన్నవారిని విడిచిపెట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఏ.విజరు కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బి.పద్మ, నాయకులు జి.రాములు, కె.విజరుకుమార్, బి పవన్, వెంకట్రావు, యాదగిరి, భీంరాజ్, శ్రీనివాస్, శంకర్, కృష్ణప్రసాద్, చెన్నయ్య, వెంకన్న, జానయ్య, జగదీష్, నాగేందర్, వంశీ, పవన్ క్రాంతికుమార్, ఎస్.పవన్ తదితరులు పాల్గొన్నారు.