Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు పంచాయతీలను కలిపితేనే భద్రాద్రికి పూర్వ వైభవం
- ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యం: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హరిత హౌటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడ్లారు. రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్రానికి తలొగ్గేలా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని అన్నారు. ఈ దాడి వల్ల అన్ని రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అలాగే రాష్ట్రాలు హక్కులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ వ్యవస్థను కాపాడేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలానికి పూర్వ వైభవం రావాలంటే ఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలిపితేనే సాధ్యమవుతుందని తెలిపారు. భద్రాద్రిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న సీఎం కేసీఆర్, తనయుడు మంత్రి కేటీఆర్‌లకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలియవా అని ప్రశ్నించారు. దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయని, తాము మంచి స్నేహితులమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారని చెప్నారు. అంత మంచి స్నేహితులు అయితే ఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు గ్రామ పంచాయతీలను సీఎం జగన్‌తో మాట్లాడి తెలంగాణలోని భద్రాచలంలో కలపొచ్చు కదాని ప్రశ్నించారు. ధరల నియంత్రణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
పెట్రోలు, డీజిల్ ధరలు కంటితుడుపులుగా ఐదు నుంచి ఆరు రూపాయలు తగ్గించి బీజేపీ విస్తృతమైన ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కాగా ఏప్రిల్ నెల 7.7 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 25వ తేదీ నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. భద్రాచలం పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగాలంటే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అదే విధంగా భద్రాద్రికి పూర్వవైభవం రావాలంటే ఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.