Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత, ప్రాంత వైషమ్యాలను రెచ్చగొడుతున్నది
- మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీలో సీఎం కేసీఆర్
- ఇలాగే కొనసాగితే మరింత నష్టమంటూ ఆందోళన
- మూణ్నెల్లలో సంచలన వార్తలొస్తాయంటూ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో దేశం ప్రమాదకర పరిస్థితుల్లో కూరుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అది కుల, మత, ప్రాంత, భాషా వైషమ్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోందని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశానికి మరింత నష్టమంటూ ఆయన హెచ్చరించారు. అందువల్ల రాజకీయ నిష్ణాతులు, సీనియర్ నాయకులు, మేధావులు దీనిపై స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. బెంగళూరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గురువారం అక్కడి పద్మనాభనగర్‌లో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలతోపాటు కర్నాటకలోని పరిణామాలు, సమకాలీన అంశాలపై వారిరువురూ చర్చించారు. కేంద్రంలో మార్పు తథ్యమని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల తర్వాత జాతీయ రాజకీయాలకు సంబంధించి తసంచలన వార్త రాబోతుందని ఆయన ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతేనే దేశాన్ని రక్షించుకోగలమని అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి జేడీఎస్ మద్దతునిస్తుందంటూ ఈ సందర్భంగా దేవెగౌడ హామీ ఇచ్చారు. కర్నాటక మాజీ సీఎం, దేవెగౌడ తనయుడు కుమారస్వామి కూడా భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఆయనతో కలిసి కేసీఆర్ విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే ఎందరో ప్రధానులు, ఎన్నో ప్రభుత్వాలు దేశాన్ని పరిపాలించాయనీ, అయినా దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఇన్నేండ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా మనసు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికా కంటే ఆర్థికంగా మనమే ముందుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఆజాదీకా అమృతోత్సవాలను జరుపుకుంటోందనీ, అయినా ఇప్పటికీ కరెంట్, మంచినీళ్లు, సాగు నీటి కోసం దేశ ప్రజలు అల్లాడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది ఇక్కడ ప్రధానాంశం కాదనీ, ఒక ఉజ్వల భారతం కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మోడీ పాలనతో దేశంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదని సీఎం విమర్శించారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. బెంగళూరు పర్యటనలో కేసీఆర్ వెంట ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, జాజుల సురేందర్, కృష్ణమోహన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్... గురువారం రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
సీఎంతో బీసీ కమిషన్ సభ్యుల భేటి...
ఒకరోజు పర్యటన నిమిత్తం బెంగళూరుకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను... ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిశోర్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.