Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థినుల పట్ల సిబ్బంది లైంగిక వేధింపులు
- కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు
నవతెలంగాణ-భూపాలపల్లి
నాణ్యమైన విద్యపొంది ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాధ్యతాయుతంగా చూడాల్సిన పాఠశాల సిబ్బంది విద్యార్థినీలను లైంగిక వేధింపులకు గురిచేయడంతో బాలికలు మానసిక క్షోభ అనుభవిస్తూ భరించలేని పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 9వ తరగతి వరకు ఈ నెల 23 నుంచి సెలవులిచ్చారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉండటంతో సుమారు 32మంది బాలికల ఆశ్రమ పాఠశాలలోనే ఉంటూ పరీక్షలకు హాజరవుతున్నారు. గురువారం గణిత పరీక్ష పూర్తి అయి పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తమ బాధలను వెలిబుచ్చారు. పాఠశాలలో వంట మనిషిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్, వాచ్మెన్ శంకర్ కొన్నిరోజులుగా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు తమ బాధను నేరుగా జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాకు ఫోన్ ద్వారా తెలిపారు. స్పందించిన కలెక్టర్ విచారణ నిమిత్తం మహిళా అధికారులను నియమించి పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
వంటమనిషి, వాచ్మెన్లను సస్పెండ్ చేయాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దమెర కిరణ్
జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాచ్మెన్, వంట మనిషిని వెంటనే సస్పెండ్ చేయాలి. బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా ప్రిన్సిపాల్‌ను నియమించకుండా జెంట్స్ ప్రిన్సిపాల్ ఉండటం వల్లే విద్యార్థినులు తమ సమస్యలను చెప్పలేకపోతున్నారు. దీనిని ఆసరా చేసుకుని వంట మనిషి, వాచ్మెన్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవ ర్తిస్తున్నారు.విద్యార్థులు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ల వైపు వెళ్లడం, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్యంగా మాట్లాడటం లాంటివి చేస్తున్నా రు.వెంటనే బాలికల ఆశ్రమ పాఠశాలకు మహిళా ప్రిన్సిపాల్ నియమించటంతో పాటు బాలికలను ఇబ్బందులుపెడుతున్న వారిని సస్పెండ్ చేసి, లైంగిక వేధిం పుల కేసు నమోదు చేయాలి. లేదంటే సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం.