Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ కమిషనర్‌కు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరగా ప్రభుత్వానికి పంపించాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం కోరింది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను గురవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకులకు సంబంధించిన మంజూరైన పోస్టుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జనరల్ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించి మెరిట్ జాబితాలు మల్టీ జోన్-1లో 1,128 మంది, మల్టీ జోన్-2లో 1,840 మంది వివరాలను 38 సబ్జెక్టుల వారీగా పూర్తి చేశామని కమిషనర్ వివరించారని తెలిపారు. ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకుల మెరిట్ జాబితా తయారు చేస్తున్నామన్నారని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లోగా వాటిని పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు గౌతం తదితరులు పాల్గొన్నారు.