Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన మోడీ ప్రధాని హౌదాలో అబద్ధాలు చెప్పారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఒక్క సంస్థలను కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసిన చరిత్ర మోడీదేనని తెలిపారు. తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలిపి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నదన్నారు. వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండి బీజేపీ పాలిత రాష్ట్రాలను పోషిస్తున్నదని చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టే కొత్త సచివాలయం కడుతున్నామనీ, మోడీ సర్కారు మూఢ నమ్మకాల కోసమే కొత్త పార్లమెంటు కడుతున్నదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అమరుల ఆశయాలను నెరవేర్చిందని చెప్పారు.
ధాన్యం కొనుగోలు చేయని మోడీ... : నిరంజన్ రెడ్డి
రాష్ట్ర రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ముందుకు రాని ప్రధాని మోడీ కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్లను మాఫీ చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 15 లక్షల ఖాళీలుంటే భర్తీ చేయడం చేతకాని మోడీ యువకుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనా సమయంలో చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ ప్రజలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని మోడీ, అమిత్ షా అమ్ముతున్నారనీ, అంబానీ, ఆదానీలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. భాషల మీద, నమ్మకాల మీద విషం చిమ్ముతూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ చిల్లర రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.
మీ ఢిల్లీ పీఠం పైలం.....
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనీ, ముందు ఢిల్లీ పీఠం కదలకుండా ప్రధాని మోడీ చూసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఅర్ అని ప్రజలు గుర్తించారని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటుండటంతో బీజేపీకి మింగుడుపడటం లేదని తెలిపారు. దేశ ప్రజల పక్షాన బయలుదేరిన కేసీఆర్ భయం ప్రధాని మోడీలో మొదలైందని చెప్పారు. సైన్స్‌ను నమ్మి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారనీ, దైవభక్తితో యాదాద్రి దేవాలాయాన్ని నిర్మించారనీ, బీజేపీ తీరుగా దేవుణ్ని వాడుకునే అలవాటు లేదని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.