Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంఈ పరిధిలో ఏపీకి ప్రొఫెసర్ల కేటాయింపుపై విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక వైపు జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆ క్రమంలో రాష్ట్రంలో పెరుగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. అందుకు తగినట్టు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి ఉన్నారన్న కారణంతో 30 ఏండ్ల అనుభవం కలిగిన 11 మంది ప్రొఫెసర్లను తెలంగాణ వైద్యవిద్య విభాగం ఏపీకి పంపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటవుతున్న తరుణంలో ఇలాంటి చర్యలు వైద్యవిద్య వ్యాప్తికి అటంకంగా మారుతాయనే వాదన వినపడుతున్నది. కొద్ది రోజుల క్రితం ఏపీకి కేటాయించిన 11 మంది కూడా ఆయా విభాగాల్లో దశాబ్దాల అనుభవం కలిగిన వారు కావడం గమనార్హం. కేవలం తమ పదోన్నతులకు సీనియర్లు అడ్డు వస్తున్నారని భావించిన కొందరు పై అధికారుల అండదండలతో ఈ చర్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉన్నపళంగా కేటాయింపు చేయడానికి అదే కారణమని ఆ శాఖలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఏపీకి కేటాయించిన వారిలో మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, గైనకాలజీ, బయో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ తదితర విభాగాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వారున్నారు.
ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లను నియమించుకునేందుకు అదనంగా రూ.50 వేలు చెల్లించాల్సి వస్తున్నది. అది కూడా కాంట్రాక్టు ప్రాతిపాదికన మాత్రమే. ఇంత చేసినా ఆ వచ్చే ప్రొఫెసర్లకు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల నైపుణ్యం ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమే. ఇక ఏపీకి కేటాయించిన ప్రొఫెసర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. తాము వైద్యవిద్య పూర్తి చేసుకున్న తర్వాత తమ సర్వీసంతా తెలంగాణలోనే కొనసాగిందని వారు చెబుతున్నారు. కేవలం సీనియారిటీలో హై ర్యాంకులో ఉన్నందువల్లే తమను ఏపీకి కేటాయించారని విమర్శిస్తున్నారు. అక్కడ పదోన్నతులు, మెరుగైన సర్వీసు ఉన్నప్పటికీ దశాబ్దాలుగా సేవలందించిన తెలంగాణలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నామని చెబుతున్నారు. ఈ కేటాయింపులపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.