Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
వివిధ సంక్షేమ పథకాలతో లబ్ది పొంది ఉన్నత స్థాయికి చేరుకున్న వారు సంక్షేమ పరిషత్‌కు సహకారం అందించాలని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. వివేకానంద విదేశీ విద్యాపథకానికి విద్యార్థులకు మంజూరు పత్రాలను తెలంగాణ సారస్వత పరిషత్‌లోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్వహణలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కులపరంగా సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. రమణ అధ్యక్షతన ఏర్పడిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా ఉందన్నారు. వైశ్యులు, రెడ్లు కూడా కార్పొరేషన్ కావాలంటున్నారని చెప్పారు. అధ్యక్షత వహించిన పరిషత్ చైర్మెన్ డాక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ.. వివిధ సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు. కొందరు దళారీలు పైరవీలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో ఏసీబీ, నిఘా విభాగాలు ఆచూకీ తీస్తున్నాయని చెప్పారు. విదేశీ విద్యకు ఈ విద్యా సంవత్సరం 133 మందిని ఎంపిక చేశామని, 26 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు నివేదికలో పరిషత్ సభ్య కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి జ్వాలా నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాలచారి, సంక్షేమ పరిషత్ సభ్యుడు సతీష్, గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, పరిషత్ పాలనాధికారి రఘురాం శర్మ పాల్గొన్నారు.