Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తామే పెంచి నిర్ణయిస్తాం..: పవర్లూమ్ కార్మిక సంఘం నేత మూషం రమేష్
- సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
కాటన్ వస్త్రం ఉత్పత్తి చేసే కార్మికులు, ఆసాములకు వెంటనే కూలి పెంచాలని.. లేదంటే తామే పెంచి నిర్ణయిస్తామని పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూషం రమేష్ యజమానులను హెచ్చరించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కాటన్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలి అగ్రిమెంట్ ముగిసి 3 సంవత్సరాలు అవుతుం దన్నారు. అయినా యజమానులు కూలి పెంచేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ విషయంపై గత సంవత్సరం కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి, లేబర్ అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. జిల్లా లేబర్ కమిషనర్ చర్చలు జరిపారని.. ప్రస్తుతం కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయని తమకు గిట్టుబాటు కావడం లేదని, ఆరునెలల్లోపు కూలి పెంచుతామని యజమానులు చెప్పారని తెలిపారు. కానీ ఇంతవరకూ కూలి పెంచకపోవడంతో పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులకు సరైన వేతనాలు రాక, ఆసాములకు గిట్టుబాటు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట కూడా ఉత్పత్తిదారులకు, వస్త్ర వ్యాపార సంఘాలకు నోటీసులు ఇచ్చామన్నారు. యజమానులు వెంటనే స్పందించి కూలి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ కార్మిక సంఘం అధ్యక్షుడు కోడం రమణ, సీఐటీయూ నాయకులు మోర అజరు, ఆసాముల, కార్మిక సంఘం నాయకులు చేరాల అశోక్, మండల రాజు, నక్క దేవదాస్, గడ్డం ఎల్లయ్య పాల్గొన్నారు.