Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
- న్యాయం చేయాలంటూ మృతదేహాలతో బంధువుల ఆందోళన
- బస్సు అద్దాలు ధ్వంసం
నవతెలంగాణ-ముదిగొండ
ఆటోని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి వద్ద గురువారం జరిగింది. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ (55), తమలపాకుల హర్షవర్ధన్ (8) సింగరేణి మండలం కమలాపురం గ్రామానికి చెందిన చాగంటి రమేష్(35) ఆటోలో ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో తమ బంధువుల ఖర్మకు వెళ్లారు. తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా గోకినేపల్లి వద్ద కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు అతివేగంగా వచ్చి లారీని తప్పించబోయి ఆటోని ఢ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ బొడ్డు ఉప్పలయ్య, తమలపాకుల ఉపేందర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. భారతమ్మ, హర్షవర్థన్, రమేష్ అక్కడికక్కడే మృతిచెందారు. ముదిగొండ ఎస్ఐ తోట నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఖమ్మం తరలించే ప్రయత్నం చేయగా మృతుల బంధువులు అడ్డుకొని న్యాయం చేయాలంటూ రాస్తారోకో చేపట్టారు. ఆగ్రహంతో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సంఘటనా స్థలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరణించిన వారికి ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల బంధువులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.