Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు
- అమీర్‌పేట్ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన
- డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై అసహనం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
రాష్ట్రంలో వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదు.. వాళ్లు కండ్లులేని కబోదుల్లా మాట్లాడు తున్నారు అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని 50 పడకల ప్రభుత్వాస్పత్రిని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కానీ కాంగ్రెస్ వాళ్లకు నచ్చక ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోందని, కాంగ్రెస్ నేత గీతారెడ్డి ఓ డాక్టర్ అయ్యుండి కూడా రాష్ట్ర వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధిని గ్రహంచకపోవడం చాలా బాధాకర మని అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి అభివృద్ధిపై జగ్గారెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే గతమని, ప్రస్తుతమంతా దాని పరిస్థితి ఆగమాగమేనని ఎద్దేవా చేశారు. కరోనా టైమ్‌లో గాంధీ ఈస్పత్రిలో అత్యున్నత సౌకర్యాలు కల్పించామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించామని చెప్పారు. 70 ఏండ్లలో మూడు కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేస్తే.. ఏండేండ్లలో 33 కళాశాలలు కట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. అమీర్‌పేట్ ఆస్పత్రిలో కలియదిరిగిన మంత్రి హరీశ్‌రావు రోగులతో ముచ్చటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రసవం అయిన ఓ మహిళకు కేసీఆర్ కిట్ అందజేశారు. అంతకుముందు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ 14 మంది డాక్టర్లు ఉండి కూడా నెలలో కేవలం 14 ఆపరేషన్లు మాత్రమే చేయడంపై ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ కింద చేసిన చికిత్సలకు సంబంధించి వివరాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆస్పత్రిలో జనరేటర్, లిఫ్ట్‌తోపాటు కొన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి తలసాని కోరగా.. రెండుమూడు రోజుల్లో రివ్యూచేసి పనులు పూర్తి చేద్దామని హామీ ఇచ్చారు.