Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాంనగర్-బాగ్‌లింగంపల్లి పైవంతెనపై నిరసనలు
- అవసరంలేదంటున్న నిపుణులు, ఇంజినీర్లు
- అధికారులూ అనాసక్తి రద్దు చేయాలంటున్న బాధితులు
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీలో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు కారిడార్లు నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ, రాంనగర్-బాగ్‌లింగంపల్లి మార్గంలో రూ.426 కోట్లతో రెండు ఫ్లై ఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.350 కోట్లతో ఇందిరాపార్కు-వీఎస్టీ, రూ.76 కోట్లతో రాంనగర్-బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్ల పనులు జరుగుతున్నాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ ఇందిరాపార్కు వద్ద గల గణేష్ టెంపుల్ వద్ద ప్రారంభమై వీఎస్టీ జంక్షన్(ఆజమాబాద్) మీదుగా విద్యానగర్ వెళ్లే మార్గంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పూర్తవుతుంది. దీంతోపాటు రాంనగర్-బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్‌ను రూ.76 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. కానీ రాంనగర్- బాగ్‌లింగంపల్లి మార్గంలో ట్రాఫిక్ సమస్య నామ మాత్రంగానే ఉందని, ఈ మార్గంలో ఫ్లై ఓవర్ అవసరం లేదని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న బల్దియా అనవసరమైన ఫ్లై ఓవర్‌ను నిర్మించడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. ఫ్లైఓవర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది..?
ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న ఇందిరాపార్కు- వీఎస్టీ మార్గంలో స్టీల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. అయితే, ఉక్కు కొరత కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ పనులు పూర్తయిన తర్వాత రాంనగర్ - బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వచ్చే వాహనాల కోసం ఈ ఫ్లై ఓవర్‌ను డిజైన్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రాంనగర్ నుంచి వచ్చే వాళ్లకు ట్రాఫిక్ సమస్య ఎక్కడా ఉండదని, బాగ్‌లింగంపల్లికి రావడానికి 10-16 సర్వీస్ రోడ్లు ఉన్నాయని, ఫలితంగా ట్రాఫిక్ సమస్య అనేది ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫ్లై ఓవర్‌ను ముందుగా ఆర్టీసీ కల్యాణ మండపం దగ్గర ముగించాలని ప్రణాళిక రూపొందించారు. తర్వాత ఏం జరిగిందో? కానీ అంబేద్కర్ కాలేజ్ వద్దకు మార్చుతూ మరోసారి డిజైన్ చేశారు. దీంతో హౌసింగ్ బోర్డుకు చెందిన హెచ్ఐజీ, ఎంఐజీ ప్లాట్లతోపాటు మధ్యతరగతి ప్రజలు తమ ఇండ్లను కోల్పోనున్నారు. వ్యాపార సముదాయాలు, ఇండ్లు మొత్తంగా 65 ఆస్తులు దెబ్బతినే అవకాశముంది. వీటిలో 15 దుకాణాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇండియన్ హ్యూమ్ పైప్స్ కంపెనీ స్థలం కోసం బడా రాజకీయ నేతలు ఫ్లై ఓవర్ ప్లాన్‌ను మార్చా రని, పేదల పొట్టగొట్టి పెద్దల కడుపు నింపడానికి ప్రభు త్వం ప్రయత్నిస్తోందని బాధి తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు చేసి..
జీహెచ్ఎంసీ ఖజానాలో నిధుల్లేక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే గగనంగా మారింది. ఈ తరుణంలో అవసరం లేని ఫ్లై ఓవర్ నిర్మించడమేంటని బాధితులు, స్థానికులు, ఇంజినీరింగ్ నిపుణులు, కొంత మంది సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వెళ్లే మార్గంలో 840మీటర్ల పొడవులో మూడు లైన్ల ఇండిపెండెంట్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే భూసేకరణ, నిర్మాణ ఖర్చు రూ.110 కోట్లకు చేరిందని అధికారుల అంచనా.
రద్దు కోసం ఉద్యమం
రాంనగర్- బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్‌ను రద్దు చేయాలని బాధితులు ఆందోళన బాటపట్టారు. ప్రత్యేకంగా బాధితుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రౌండ్‌టేబుల్ సమావేశం, బాధితులతో సమావేశాలు నిర్వహించారు. ఈ ఉద్యమానికి సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ పూర్తి మద్దతుగా నిలిచింది. ఫ్లై ఓవర్‌ను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది.
ట్రాఫిక్ సమస్యనే లేదు
రాంనగర్- బాగ్‌లింగంపల్లి మార్గంలో ట్రాఫిక్ సమస్య నామమాత్రమే. బాగ్‌లింగంపల్లికి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పైగా మొదటి డిజైన్ ఆర్టీసీ కల్యాణ మండపం వరకే ఉంటే ఎందుకు మార్చారు? 49గజాల స్థలం ఉంటే 40గజాలు రోడ్డు కటింగ్ పోతుంది. 9 గజాలను ఏం చేసుకోవాలి? ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
- నందిగొప్ప శ్రీనివాస్, బాధితుల కమిటీ అధ్యక్షులు
మా జీవితాలు రోడ్డున పడుతున్నాయి
రాంనగర్-బాగ్‌లింగంపల్లి ఫ్లైఓవర్ కారణంగా మా జీవితాలు రోడ్డున పడనున్నాయి. 65 మంది ఆస్తులు దెబ్బతింటున్నాయి. షాపులు పోయే ప్రమాదం ఉండటం వల్ల జీవనోపాధి లేకుండా పోతుంది. పరిహారం నామమాత్రంగానే ఇస్తామంటున్నారు. మా ఆస్తులు పోతే మళ్లీ కొనగలమా? ప్రభుత్వ పెద్దలు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
- వై.నాగరాజు, బాధితుల కమిటీ ప్రధాన కార్యదర్శి
డీపీఆర్‌ను బహిర్గతం చేయాలి
రాంనగర్, బాగ్‌లింగంపల్లి ఫ్లై ఓవర్ డీపీఆర్‌ను బహిర్గతం చేయాలి. ఉద్యోగులకు వేత నాలివ్వ డానికి డబ్బుల్లేవని చెబుతున్న జీహెచ్ ఎంసీ అనవసరమైన ఫ్లై ఓవర్‌ను నిర్మించడానికి డబ్బులెక్కడివి? వెంటనే ఫ్లై ఓవర్‌ను రద్దు చేయాలి. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తాం.
- ఎం.శ్రీనివాస్, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి