Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
- రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
నవతెలంగాణ-జఫర్గడ్
ల్యాండ్ పూలింగ్ జీఓ-80ఏను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ జీవోకు వ్యతిరేకంగా గురువారం జనగామ జిల్లా జాఫర్గడ్ మండలంలోని కూనూర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మూడ్ శోభన్ మాట్లాడారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ల్యాండ్ పూలింగ్ పేరుతో వరంగల్ పట్టణ పరిధి 27 గ్రామాల రైతుల నుంచి సుమారు 22వేల ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకునేందుకు జీవో తెచ్చారని చెప్పారు. ఇలా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికంటూ దౌర్జన్యంగా భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా 'కుడా' లక్షలాది రూపాయలు కొల్లగొట్టాలని చూస్తున్నదని విమర్శించారు. ఇటువంటి ఆలోచన విరమించుకోవాలని కోరారు. 22వేల ఎకరాల వ్యవసాయ భూమిపై లక్షలాదిమంది సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటు న్నారన్నారు. జనగామ జిల్లా పరిధి జఫర్గడ్ మండలం రఘునాథ్‌పల్లి గ్రామంలో 1175.14 ఎకరాలు, కునూర్ గ్రామంలో 325.37ఎకరాలు, చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో1043.02 ఎకరాలు.. మొత్తం మూడు గ్రామాల్లో 2544.13 ఎకరాలు సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. కరోనా కాలంలో వ్యవసాయ రంగం దేశానికి, రాష్ట్రానికి ఉత్పత్తి రంగంగా పని చేసి వేలాది మందికి ఉపాధి కల్పించిందని వివరించారు. కునూరు, రఘునాథపల్లి, నష్కల్ గ్రామాల్లో రైతు సంఘం ప్రతినిధులు సర్వే చేపడతారని, ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేసేవరకు ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, జిల్లా నాయకులు భూక్య చందునాయక్, రైతు సంఘం మండల కార్యదర్శి నక్క యాకయ్య, మండల నాయకులు వడ్లకొండ సుధాకర్, రైతు సంఘం నాయకులు వేల్పుల చిన్న రాములు, ఎండీ ఓరుగంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.