Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యం బస్తాలు
- సిటీలో గాలివాన దుమారం
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో చెట్లు నేలకొరిగాయి.. ఇండ్లపై ఇనుప రేకులు ఎగిరి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడ్డాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన కురవడంతో రోడ్లపైన చెట్లు నేలకొరిగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో గంధం రజిత ఇంటి రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోవడంతో నిత్యావసర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి.
అలాగే ఆరబెట్టిన ధాన్యంతో పాటు కాంటా చేసిన బస్తాలు, లారీలలో లోడ్ చేసిన బస్తాలు అన్నీ తడిసిపోయాయి. రెంజల్ మండలంలోని మౌలాలి తాండ గ్రామంలో ఈదురు గాలులకు కిరాణా షాప్‌తోపాటు, ఒక ఇంటికి సంబంధించిన రేకులు ఎగిరి పోయాయి. ఎడపల్లి మండలంలో వడగండ్ల వాన పడింది. ఆర్మూర్ పట్టణం లోని పెర్కిట్ శ్రీరామ కాలనీలో ఓ ఇంటి ముందున్న చెట్టు నేలరాలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. బోధన్ మండలంలో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులకు రేకుల షెడ్డు కూలింది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఆర్డీవో కార్యాలయం దగ్గరున్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు వాహనాలపై పడ్డాయి. దాంతో మూడు కార్లు ధ్వంస మయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాల య్యాయి. షేక్‌పేట్, గోల్కొండ, శేరి లింగంపల్లి, కాప్రా, అంబర్పేట్, హిమాయత్‌నగర్, చార్మినార్, ఉప్పల్, సైదాబాద్, బండ్లగూడ, కూకట్పల్లి, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, సుచిత్ర, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్ తుర్కయంజాల్, ఇంజాపూర్, బడంగ్పేట్, మీర్పేట్ ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ, చిలుకలగూడ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అయితే రెండు రోజులపాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.